కొడుకే కత్తితో పొడిచి చంపేశాడు

కొడుకే  కత్తితో పొడిచి చంపేశాడు

ఢిల్లీలో నిన్న జరిగిన త్రిపుల్ మర్డర్ కేసును పోలీసులు చేధించారు. తన జల్సాలకు అడ్డువస్తున్నారని తల్లిదండ్రులు దారుణంగా హత్య చేసింది వారి కుమారుడే అని తేల్చారు. 19ఏళ్ల సూరజ్ వర్మ అతని సోదరిని కూడా  పొట్టన బెట్టుకున్నాడు. ఈ నేరాన్ని తండ్రిపై నెట్టాలని చూశాడు. చివరికి నేరాన్ని అంగీకరించాడు.  మిథిలేశ్‌ అనే ఇంటీరియర్‌ డిజైనర్‌ భార్యా పిల్లలతో కలిసి దక్షిణ ఢిల్లీలో ఉంటున్నాడు. 19 ఏళ్ల కొడుకు సూరజ్‌ గురుగ్రామ్‌లోని ఓ కాలేజీలో సివిల్‌ ఇంజినీరింగ్‌ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. జల్సాలకు అలవాటు పడ్డ సూరజ్‌ చదువును నిర్లక్ష్యం చేసేవాడు. దీంతో తల్లిదండ్రులు స్నేహితులతో తిరగొద్దని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులపై కోపం పెంచుకున్న సూరజ్‌.. వారిని హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు.  బుధవారం ఉదయం తెల్లవారు జామున సూరజ్‌.. బెడ్‌రూంలో నిద్రిస్తున్న తల్లిదండ్రులు, చెల్లెలిపై కత్తితో దాడి చేసి దారుణంగా హత్యచేశాడు. తర్వాత కేసును పక్కదారి పట్టించే ప్రయత్నం చేశాడు. ఇరుగుపొరుగు వారిని పిలిచిన సూరజ్‌ తన తల్లిదండ్రులు, చెల్లెల్ని దొంగలు చంపేశారని చెప్పాడు. అనుమానం రాకుండా తనని తాను కత్తితో గాయపరచుకున్నాడు.  అయితే సూరజ్‌ ప్రవర్తనతో అనుమానం కలిగిన పోలీసులు అతడిని పోలీసు స్టేషనుకు పిలిపించారు. తమదైన శైలిలో విచారిస్తే నిజం చెప్పాడు. జల్సాలకు అడ్డువస్తున్నారని తానే చంపినట్లు అంగీకరించాడు.