కొబ్బరినీళ్ళు డయాబెటిక్స్‌కు మంచిదా?

కొబ్బరినీళ్ళు డయాబెటిక్స్‌కు మంచిదా?

చాలా మంది కొబ్బరినీళ్లను ఆరోగ్యకరమైన పానీయంగా భావిస్తారు. తక్కువ ఫ్యాట్ కలిగిన కొబ్బరినీళ్లు దాహం తీరుస్తాయి. పోషకాలు పుష్కలంగా ఉండటం వల్ల కొబ్బరినీళ్లు శరీరాన్ని రోజంతా హైడ్రేటెడ్ గా ఉంచుతాయి. శరీరంలో ఎలక్ట్రోలైట్ లెవెల్ ని పెంచుతాయి కనుక నీరసంగా అనిపించినప్పుడు కొబ్బరినీళ్లు తాగమని సలహా ఇస్తారు. తక్కువ క్యాలరీలు ఉన్నందువల్ల డైట్ ఫాలో అయ్యేవాళ్లు కూడా కొబ్బరినీళ్లు తాగుతారు. ఇవే కాదు.. చెప్పుకుంటూ పోతే కొబ్బరినీళ్లతో ఉపయోగాలు ఎన్నెన్నో...

పోషకాల గని: ఆకుపచ్చగా లేత కొబ్బరి బొండాల్లో ఉండే నీళ్లలో పీచు పదార్థం, విటమిన్ సి, మరెన్నో ముఖ్యమైన ఖనిజాలు ఉంటాయి. 94% నీళ్లు ఉన్నందువల్ల శరీరానికి, చర్మానికి మంచి పోషణ ఇస్తాయి కొబ్బరినీళ్లు. ఇందులో కొవ్వు అసలే ఉండకపోవడం మరో విశేషం. ఎవరైనా నీరసంగా నిస్సత్తువగా ఉంటే వెంటనే బాడీని రీచార్జీ చేయాలంటే ఒక లేత కొబ్బరి బోండాం నీళ్లు తాగిస్తే చాలు.

డయాబెటిస్ కి మంచిది: కొబ్బరినీళ్లు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తాయని పరిశోధకులు నిరూపించారు. కేవలం మూడు గ్రాముల పీచు పదార్థం, కప్పుకి సులువుగా జీర్ణమయ్యే ఆరు గ్రాముల పిండి పదార్థం ఉన్నందువల్ల మధుమేహ వ్యాధిగ్రస్తులు నిరభ్యంతరంగా కొబ్బరినీళ్లు తీసుకోవచ్చు. ఇన్సులిన్ కి స్పందించే గుణాన్ని మెరుగుపరచి రక్తంలో చక్కెరను తగ్గించే మెగ్నీషియం విరివిగా ఉన్నందువల్ల టైప్ 2 డయాబెటీస్, ప్రీడయాబెటిక్స్ ఉన్నవారు కొబ్బరినీళ్లు తీసుకుంటే మంచిది.

యాంటీ ఆక్సిడెంట్ గుణాలు: కొబ్బరినీళ్లలోని యాంటీ ఆక్సిడెంట్స్ కణాలను నాశనం చేసే ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తాయి. ఇదే కాకుండా రక్తపోటు, ట్రైగ్లిజరైడ్స్, ఇన్సులిన్ స్థాయిలను క్రమబద్ధీకరిస్తాయి. శరీరంలో ఉత్పత్తి అయ్యే అస్థిర అణువులను నియంత్రించడంతో పాటుగా వాటి కారణంగా శరీరానికి కలిగే హానిని బాగా తగ్గిస్తుంది.

కిడ్నీలో రాళ్లు రాకుండా చేస్తుంది: మూత్రపిండాలలో రాళ్లు ఏర్పడకుండా కొబ్బరినీళ్లు అడ్డుకుంటాయని పరిశోధనలో రుజువైంది. క్రిస్టల్, రాళ్లు ఏర్పడడాన్ని కొబ్బరినీళ్లు తగ్గిస్తాయి. మూత్రపిండాలు, మూత్ర నాళంలోని ఇతర భాగాలకు క్రిస్టల్స్ అతుక్కోకుండా నిరోధిస్తాయి. మంచినీళ్లు తాగడం మూత్రపిండాలకు మంచిదైతే కొబ్బరినీళ్లు తాగడం మహా మంచిదని పరిశోధకులు సూచిస్తున్నారు.

గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది: కొబ్బరినీళ్లు తాగినందువల్ల గుండె జబ్బులొచ్చే ప్రమాదం తక్కువని చెబుతున్నారు. కొలెస్టరాల్ తగ్గించే లక్షణాల కారణంగా కొబ్బరినీళ్లు తాగితే గుండె ఆరోగ్యం బాగుంటుందని అంటున్నారు. అయితే ఇందుకోసం కొబ్బరినీళ్లను చాలా ఎక్కువగా తాగాల్సి ఉంటుంది. ఏదేమైనా కొబ్బరినీళ్లు మన శరీరంలో అద్భుతాలు చేస్తాయి.

వ్యాయామం తర్వాత ఎంతో మేలు: క్రీడాకారులు, వ్యాయామం చేసేవారు ఆరోగ్య పానీయాలు తాగుతుంటారు. కానీ వాటన్నిటి కంటే కొబ్బరినీళ్లు ఎంతో మేలని సూచిస్తున్నారు. శరీరం కోల్పోయిన ద్రవాలు, ఎలక్ట్రోలైట్స్ వెంటనే తిరిగి చేర్చడంలో కొబ్బరినీళ్లని మించిన పానీయం లేదని పరిశోధకులు వివరిస్తున్నారు. తల తిరగడం, కడుపులో గడబిడలను వెంటనే తగ్గించగల అద్భుత పానీయం కొబ్బరినీళ్లు.

కాబట్టి ఇప్పుడే ఖరీదైన పానీయాల మాట మర్చిపోండి. వెంటనే సహజమైన ఆరోగ్యకరమైన కొబ్బరినీళ్లకు మారిపోండి.