కరోనా సమయంలో పరీక్షలు.. కొత్త మార్గదర్శకాలు విడుదల..

కరోనా సమయంలో పరీక్షలు.. కొత్త మార్గదర్శకాలు విడుదల..

కరోనా విజృంభణతో పరీక్షలు వాయిదా వేస్తూ వచ్చారు... ఇక, రోజురోజుకీ కరోనా కేసుల సంఖ్య కొత్త రికార్డులు సృష్టిస్తూ పరుగులు పెడుతుండడంతో... కరోనాతో సహజీవనం తప్పదని పాలకులే సెలవిచ్చారు. మరోవైపు.. విద్యాసంవత్సరం నష్టపోకుండా ఆయ పరీక్షలను కూడా నిర్వహిస్తున్నారు.. అయితే, ఈ నేపథ్యంలో పరీక్ష నిర్వహణలో అనుసరించే స్టాండర్డ్‌ ఆపరేటింట్‌ ప్రొసీజర్‌(ఎస్‌వోపీ)లను సవరించింది కేంద్ర ప్రభుత్వం.. కరోనా లక్షణాలతో ఎవరైనా విద్యార్థి పరీక్ష రాయడానికి వస్తే వారిని దగ్గర్లోని ఆస్పత్రికి పంపాలని కొత్త రూల్స్‌లో పేర్కొంది సర్కార్. ఆ విద్యార్ధులకు మరో తేదీన లేదా వేరే మార్గంలో పరీక్ష రాసే ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ మేరకు సవరించిన ఎస్‌వోపీను విడుదల చేసింది కేంద్ర ఆరోగ్యశాఖ. 

కాగా, కోవిడ్‌ లక్షణాలున్న వారు పరీక్ష రాయలనుకుంటే అవకాశం కల్పించాలని గతంలో ఇచ్చిన మార్గదర్శకాల్లో పేర్కొన్న కేంద్రం.. ఇప్పుడా వెసులుబాటును తొలగించింది. ఇది పరీక్షలు నిర్వహించే అన్ని విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, పాఠశాలలకు వర్తిస్తుందని కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టంచేసింది. కేవలం కోవిడ్‌ లక్షణాలు లేని విద్యార్థులు, సిబ్బంది మాత్రమే పరీక్షా కేంద్రాలకు రావాలని స్పష్టంగా పేర్కొంది కేంద్రం. మరోవైపు.. కంటైన్‌‌మెంట్‌ జోన్లలో ఉండే పరీక్ష నిర్వాహకులు, సిబ్బందికి పరీక్షా కేంద్రాలకు అనుమతి లేదని గతంలో ఇచ్చిన మార్గదర్శకాల్లో స్పష్టంగా పేర్కొన్నారు.. ఇక, ఆరోగ్యంగా ఉన్న విద్యార్థులు సైతం.. పరీక్షకు హాజరయ్యే సమయంలో తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, శానిటైజర్లు అందుబాటులో ఉంచుకోవాలని పేర్కొన్న సంగతి తెలిసిందే.