భారీ వర్షం.. ప్రాజెక్టుల గేట్లు ఎత్తివేత

భారీ వర్షం.. ప్రాజెక్టుల గేట్లు ఎత్తివేత

బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత రాత్రి నుంచి ఎడతెరిపిలేని వర్షం పడుతోంది. రాత్రి 12 గంటల నుంచి హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో వర్షం ఇంకా కొనసాగుతూనే ఉంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు తోడుగా ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి నదిలో వరద ఉదృతి రోజురోజుకూ పెరుగుతోంది. ఈ వరద ఉదృతితో తెలంగాణలోని పలు ప్రాజెక్టుల గేట్లను అధికారులు తెరిచారు. కడెం ప్రాజెక్టు మొత్తం నీటిమట్టం 700 అడుగులు ఉంటే ఇప్పటికే 698 అడుగుల మేర నీరు చేరడంతో మూడు గేట్లను ఎత్తి వచ్చిన నీటిని కిందకు వదులుతున్నారు. కొమురం భీం ప్రాజెక్టుకు కూడా వరద ఉదృతి ఎక్కువగా ఉండటంతో మూడు గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. తాలిపేరు, కిన్నెరసాని ప్రాజెక్టు వరద నీటిని బుధవారం నుండే దిగువకు వదులుతున్నారు. దీంతో భద్రచాలం వద్ద గోదావరి నీటిమట్టం మరింతగా పెరిగింది. బుధవారం ఉదయం భద్రచాలం వద్ద గోదావరి నీటిమట్టం 30.6 అడుగులు ఉంది.