జగన్ ప్రమాణస్వీకార ఏర్పాట్లకు ఆటంకం..!

జగన్ ప్రమాణస్వీకార ఏర్పాట్లకు ఆటంకం..!

కృష్ణా జిల్లాలో అర్ధరాత్రి గాలివాన బీభత్సం సృష్టించింది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ముఖ్యంగా విజయవాడలో కురిసిన భారీ వర్షానికి హోర్డింగులు కూలిపోయాయి. ఇవాళ వైఎస్ జగన్ ప్రమాణస్వీకారానికి ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో చేసిన ఏర్పాట్లపైనా గాలివాన ప్రభావం పడింది. ఉదయమంతా సూర్యుడు నిప్పుడు కక్కితే... జనమంతా విలవిలలాడారు. రాత్రి అయ్యే సరికి సీన్ ఒక్కసారిగా మారిపోయింది. వాతావరణంలో మార్పు వచ్చింది. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం అర్ధరాత్రి విజయవాడలో బీభత్సం సృష్టించింది. అకాల వర్షానికి బెజవాడ చిగురుటాకులా వణికిపోయింది. ఒక్క విజయవాడలోనే కాదు... కృష్ణాజిల్లా అంతా వర్షం కురిసింది. మైలవరం, తిరువూరు, హనుమాన్‌ జంక్షన్, విజయవాడలో ఎడతెరిపి లేకుండా వర్షం పడింది. ఓవైపు పిడుగుపాట్లతో జనం వణికిపోయారు. మరోవైపు గాలివాన బీభత్సంతో విజయవాడలోని చాలా ప్రాంతాల్లో రాత్రంతా చీకట్లోనే మగ్గాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక వర్షం తర్వాత మళ్లీ ఏర్పాట్లపై అధికారులు దృష్టిసారించారు.. ఉదయం వరకు కొన్ని ఏర్పాట్లు చేసినా... ఉదయం మళ్లీ వర్షం వచ్చింది. ఓవైపు స్టేడియం దగ్గరకు వైసీపీ శ్రేణులు భారీగా చేరుకుంటున్నారు. వర్షం కారణంగా కొంత ఇబ్బంది కర పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే, ప్రమాణస్వీకారోత్సవానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. స్టేడి పనులు ఇప్పటికే పూర్తికాగా.. స్టేడియంలో కూడా ఏర్పాట్లపై దృష్టిసారించారు.