తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షం...

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షం...
అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో గత రాత్రి నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్నాయి. వరంగల్, మహబూబ్ నగర్, రంగారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం, ఆదిలాబాద్, మేడ్చల్ తదితర జిల్లాల్లోనూ వర్షం కురిసింది. ఇక హైదరాబాద్ లో ఉరుములు, ఈదురు గాలులతో కూడిన వర్షం కురుస్తుండటంతో.. రోడ్లపైకి నీరు చేరి వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. మలక్ పేట, పంజాగుట్ట, అమీర్ పేట, కోటి ప్రాంతాల్లో వర్షంతో రోడ్లపై నీరు చేరడంతో బయట నుండి వచ్చే ప్రైవేట్ బస్సులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈదురు గాలులతో కూడిన వర్షం పడుతుండటంతో నగరంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. హైదరాబాద్ నగరంలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో రాత్రి నుంచి ఎడతెగని వర్షం కురుస్తుంది. మరోవైపు ఏపీలోని గుంటూరు, ప్రకాశం, ఉభయ గోదావరి జిల్లాలతో పాటు పలు చోట్ల వడగండ్ల వాన పడుతుంటంతో పంటలకు తీవ్ర నష్టం కలిగింది. ఈ అకాల వర్షాలతో వాతావరణం చల్లబడి వేసవి తాపం మాయమౌతున్నప్పటికీ.. ఈదురు గాలులు, వడగండ్ల వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ వర్షాలు మరో రెండు రోజులు ఉంటాయని వాతావరణ శాఖ తెలిపింది.