భానుడి ప్రతాపం... కోస్తా కుతకుత

భానుడి ప్రతాపం... కోస్తా కుతకుత

కోస్తాంధ్రలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. వేసవి కాలం ముగిసినా భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఎండలు ఏ మాత్రం తగ్గుముఖం పట్టకపోవడంతో వేడి, ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారు. పశ్చిమగోదావరి జిల్లా పోడూరులో శనివారం అత్యధికంగా 45.18 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. విజయనగరం జిల్లా బొండపల్లి, కన్నెమెరికలో 45.14 డిగ్రీలు, ప్రకాశం జిల్లా టంగుటూరులో 45.11 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రంలోని మొత్తం 60 ప్రాంతాల్లో 44 నుంచి 46 డిగ్రీలు, 202 ప్రాంతాల్లో 42 నుంచి 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదైనట్టు ఆర్టీజీఎస్‌ తెలిపింది. ఈ నెల 18 వరకు ఎండల తీవ్రత ఇదే స్థాయిలో ఉంటుందని అధికారులు ప్రకటించారు. వాతావరణంలో తేమ శాతం గణనీయంగా తగ్గినందున వడగాలులు అనూహ్యంగా పెరుగుతున్నాయని తెలిపింది. ఎండ‌ల్లో బ‌య‌ట తిర‌గ‌కుండా, నీడ‌ప‌ట్టున సేద‌తీరాలని, వృద్ధులు, చిన్నపిల్లల ప‌ట్ల జాగ్రత్తలు పాటించాలని ఆర్టీజీఎస్‌ హెచ్చరించింది.