శ్రీశైలానికి పర్యాటకుల తాకిడి.. భారీగా ట్రాఫిక్ జామ్..

శ్రీశైలానికి పర్యాటకుల తాకిడి.. భారీగా ట్రాఫిక్ జామ్..

కృష్ణమ్మ అందాలు చూడాలంటే శ్రీశైలం డ్యామ్ ప్రాంతానికి వెళ్లాల్సింది... ఎగువనుంచి భారీ వరద వస్తుండడంతో 10 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. శ్రీశైలం డ్యామ్ నుంచి కిందకు దూకుతోన్న కృష్ణమ్మ పాలనురుగులను కక్కినట్టుగా దిగువకు తరలిపోతోంది.. ఇక దిగువకు దూకిన కృష్ణమ్మ మేఘాల్లా మారిపోయిన సమయంలో పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. దీంతో శ్రీశైలం డ్యామ్ గేట్లు ఎత్తివేశారనే వార్త వినిపిస్తే చాలు ఇటు హైదరాబాద్, తెలంగాణలోని ఇతర ప్రాంతాల నుంచి.. అటు ఆంధ్రప్రదేశ్‌ నుంచి కూడా పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. దీంతో శ్రీశైలం డ్యామ్ దగ్గర భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.. దాదాపు 5 కిలోమీటర్లకు పైగా వాహనాలు నిలిచిపోయాయి. పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. మరోవైపు ట్రాఫిక్ నియంత్రించేందుకు శ్రీశైలం వైపు వెళ్లే వాహనాలపై ఆంక్షలు పెడుతున్నారు పోలీసులు.