అమెజాన్ కు ఏటా 360 మిలియన్ డాలర్లు చెల్లిస్తున్న యాపిల్!!

అమెజాన్ కు ఏటా 360 మిలియన్ డాలర్లు చెల్లిస్తున్న యాపిల్!!

రెండేళ్లుగా ప్రపంచంలోనే అతిపెద్ద టెక్ దిగ్గజ కంపెనీలు యాపిల్, అమెజాన్ ల మధ్య బంధం రోజురోజుకీ మరింత దృఢపడుతూ వస్తోంది. గత ఏడాది ఐఫోన్ సహా చాలా వరకు యాపిల్ ఉత్పత్తులు అమెజాన్ లో లభ్యమయ్యాయి. ఇప్పుడు తాజా రిపోర్ట్ ప్రకారం యాపిల్ ఇతర సేవల కోసం అమెజాన్ పై ఆధారపడిన వైనం వెలుగు చూసింది. సీఎన్బీసీ నివేదిక ప్రకారం అమెజాన్ క్లౌడ్ సర్వీసెస్ కంపెనీ, అమెజాన్ వెబ్ సర్వీసెస్ (ఏడబ్ల్యుఎస్)పై యాపిల్ విపరీతంగా ఆధారపడుతోంది.

అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఉపయోగించుకున్నందుకు యాపిల్ నెలకు 30 మిలియన్ డాలర్లను అమెజాన్ కు చెల్లిస్తోంది. అంటే ఏడాదికి 360 మిలియన్ డాలర్లను యాపిల్ అమెజాన్ కు పువ్వుల్లో పెట్టి మరీ సమర్పిస్తోంది. యాపిల్ ఇంత భారీ మొత్తాన్ని అమెజాన్ కు చెల్లించడానికి ఓ బలమైన కారణమే ఉంది. నెలకు 1 బిలియన్ కంటే ఎక్కువ యాపిల్ డివైస్ లు ఉపయోగించడం జరుగుతోంది. ఇంత భారీస్థాయిలో వినియోగదారుల అవసరాలు తీర్చాలంటే యాపిల్ కు అమెజాన్ క్లౌడ్ సేవలు తప్పనిసరి మరి.

సేవల వ్యాపారంలో భారీగా పెట్టుబడులు పెడుతున్న యాపిల్ కు ఇప్పుడు ఇంతకు ముందు కంటే ఎక్కువగా క్లౌడ్ సేవలు కావాల్సి ఉంటుంది. సీఎన్బీసీ రిపోర్ట్ ప్రకారం రాబోయే ఐదేళ్ల పాటు అమెజాన్ క్లౌడ్ సేవలు వినియోగించుకొనేందుకు యాపిల్ 1.5 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ చెల్లించేలా అమెజాన్ తో ఒప్పందం కుదుర్చుకుంది.

ఇటీవలే యాపిల్ క్రెడిట్ కార్డ్, గేమింగ్ సేవలు, యాపిల్ టీవీ+, మేగజైన్ సబ్ స్క్రిప్షన్ సర్వీస్ వంటి కొత్త రంగాల్లోకి అడుగు పెట్టింది. వీటితో మరింత మంది కస్టమర్లను ఆకర్షించేందుకు టెక్ దిగ్గజ సంస్థకు క్లౌడ్ సేవలు మరింత అవసరం. ఇకపై సేవల ద్వారానే యాపిల్ ఆదాయం పెరగనున్నట్టు నిపుణులు చెబుతున్నారు. 2018 ఐఫోన్లకు అనుకున్నంత డిమాండ్ లేకపోవడం, అమ్మకాల లక్ష్యాలను చేరుకోకపోవడం చూస్తుంటే యాపిల్ సర్వీస్ విభాగం భవిష్యత్తులో కీలకంగా మారనుంది. 

మరోవైపు అమెజాన్ క్లౌడ్ టెక్నాలజీలో ఎప్పుడో దిగ్గజ సంస్థగా ఎదిగింది. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో టెక్నాలజీ కంపెనీలు ఇప్పటికే జెఫ్ బెజోస్ కంపెనీ క్లౌడ్ సేవలకు భారీ మొత్తాలు చెల్లిస్తున్నాయి. క్లౌడ్ సేవల వ్యాపారంలో గూగుల్, మైక్రోసాఫ్ట్ మరో ప్రధాన దిగ్గజ సంస్థలు.