భారీగా క్షీణించిన హెరిటేజ్‌ షేర్‌...

భారీగా క్షీణించిన హెరిటేజ్‌ షేర్‌...

వైకాపా అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజారిటీ సాధించినప్పటి నుంచి... హెరిటేజ్‌ ఫుడ్స్‌ లిమిటెడ్‌ షేర్‌లో అమ్మకాల ఒత్తిడి పెరుగుతోంది. మే 23వ తేదీన ఈ కంపెనీ షేర్‌ రూ. 480 ఉండగా, ఇవాళ ఒకదశలో రూ. 387కు పడిపోయింది. తరవాత స్వల్పంగా కోలుకుని రూ. 393 వద్ద ముగిసింది. ఈ ఒక్క రోజే షేర్‌ 4.68 శాతం క్షీణించింది. 

సగానికి తగ్గింది...
రెండేళ్ళలో హెరిటేజ్‌ కంపెనీ షేర్‌ విలువ సగానికి పైగా క్షీణించింది. కంపెనీకి చెందిన రీటైల్‌ స్టోర్స్ బిజినెస్‌ను ముంబైకి చెందిన ఫ్యూచర్‌ గ్రూప్‌నకు అమ్మిన సమయంలో అంటే 2017 డిసెంబర్‌ 21వ తేదీన హెరిటేజ్‌ షేర్‌ ధర రికార్డు స్థాయిలో రూ.855లకు తాకింది. అప్పటి నుంచి షేర్‌ మార్కెట్‌ సూచీలు పెద్దగా క్షీణించకపోయినా... డెయిరీ రంగ షేర్లలో వచ్చిన డౌన్‌ ట్రెండ్‌ కారణంగా గత నెలలో అంటే మేలో కంపెనీ షేర్‌ రూ. 500 దిగువకు వచ్చింది. ఇవాళ రూ. 400కు దిగువకు వచ్చింది. 

ఆ ప్రకటనతో...
అమరావతి భూముల విషయంలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగిందని,  ముందస్తు సమాచారంతో అమరావతి ప్రాంతంలో హెరిటేజ్‌ కంపెనీ భారీగా భూములు కొనుగోలు చేసిందని వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఆరోపించారు. అలాగే చిత్తూరు డెయిరీని పునః ప్రారంభించేందుకు యత్నాలు ప్రారంభించినట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే పాడి రైతులకు లీటరు పాలుకు రూ. 4 సబ్సిడీ ఇవ్వాలన్న వైఎస్‌ జగన్‌ నిర్ణయంతో హెరిటేజ్‌ కౌంటర్‌లో అమ్మకాల ఒత్తిడి పెరిగిందని స్టాక్‌ మార్కెట్‌ వర్గాలు అంటున్నారు.
తెలంగాణ ప్రభుత్వం పాడి రైతులకు రూ.4 సబ్సిడీ ఇచ్చినపుడు హెరిటేజ్‌ కంపెనీ ఏపీతో పాటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి తక్కువ ధరకు పాలు సేకరించగలిగింది. ఇపుడు ఏపీలో కూడా సబ్సిడీ ఇవ్వడం వల్ల హెరిటేజ్‌పై భారం పడుతుందని ఇన్వెస్టర్లు భావిస్తున్నారు. పైగా అమరావతి భూములకు సంబంధించి కూడా జగన్‌ చేసిన ఆరోపణలపై ఇన్వెస్టర్లు భయపడుతున్నారు. అయితే ఏపీ ప్రభుత్వ నిర్ణయం వల్ల హెరిటేజ్‌కు పెద్దగా  వచ్చే నష్టం ఉండదని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. చిత్తూరు డైరీ సామర్థ్యం... ఆ జిల్లాలో పాల సేకరణలో కేవలం పదో వంతు మాత్రమేనని... పాలు అమ్మడం కోసం పాడి రైతులు కచ్చితంగా ప్రైవేట్‌ కంపెనీలపై ఆధారపడాల్సిందేనని వీరు అంటున్నారు. రైతుల నుంచి మొత్తం పాలు సేకరించే పరిస్థితి ప్రభుత్వ డెయిరీలకు లేదని.. అందుకే తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం వల్ల ప్రైవేట్‌ డెయిరీలకు పెద్దగా నష్టం కలగలేదని అంటున్నారు. సబ్సిడీ ఇవ్వడం వల్ల ప్రయోజనం లేదనే మహారాష్ట్ర వంటి రాష్ట్రాలు సదరు ప్రోత్సాహకాలను ఉపసంహరించాయని కూడా ఈ పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. అయితే ఏపీ మాజీ సీఎం చంద్రబాబు కుటుంబానికి చెందిన కంపెనీ కావడంతో ఇపుడున్న రాజకీయ పరిస్థితుల్లో తాజా ఇన్వెస్ట్‌మెంట్‌కు ఇన్వెస్టర్లు జంకుతున్నట్లు స్టాక్‌ మార్కెట్‌ వర్గాలు అంటున్నాయి. హెరిటేజ్‌ విషయంలో ఒక స్పష్టత వచ్చే వరకు కొత్త ఇన్వెస్టర్లు ఈ కౌంటర్‌లో రావడానికి ఇష్టపడరని... దీంతో కొన్నాళ్ళు ఈ కౌంటర్లో పెద్దగా యాక్టివిటీ ఉండకపోవచ్చని కూడా స్టాక్‌ మార్కెట్‌ వర్గాలు అంటున్నాయి.