విశాఖ ఏజెన్సీలో హైఅలర్ట్

విశాఖ ఏజెన్సీలో హైఅలర్ట్

విశాఖ ఏజెన్సీలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను అదుపు చేసేందుకు గ్రేహౌండ్స్, ఏపీఎస్పీ బలగాలను రంగంలోకి దింపారు. నిన్న అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను మావోలు హత్య చేయడంతో ఆవేశంతో ప్రజలు రెండు పోలీస్ స్టేషన్లపై దాడికి దిగారు. స్టేషన్ లోని ఫర్నిచర్, వాహనాలను ధ్వంసం చేశారు. దీంతో విశాఖ పోలీస్ కమిషనర్ మహేష్ చంద్ర లడ్డా, డీఐజీ శ్రీకాంత్ లు సమన్వయంతో పోలీసులను రంగంలోకి దించారు. అమెరికాలో ఉన్న డీజీపీ ఆర్పీ ఠాకూర్ ఎప్పటి కప్పుడు పరిస్థితిని సమీక్షించారు. 

మరోవైపు ఏజెన్సీలో పరిస్థితి మొత్తం అదుపులోకి వచ్చేంత వరకు ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాలోని ప్రజా ప్రతినిధులను సురక్షిత ప్రాంతాల్లో ఉంచాలని జిల్లాల ఎస్పీలు, ఉన్నతాధికారులను డీజీపీ కార్యాలయం ఆదేశించింది. మన్యం, నల్లమల్ల ప్రాంతాల్లో హైఅలర్ట్ ప్రకటించారు. విశాఖ నుంచి సీఆర్పీఎఫ్, స్పెషల్ పార్టీ, గ్రేహౌండ్స్, స్పెషల్ పార్టీకి చెందిన పది బృందాలతో 300 మంది పోలీసులను హుటా హుటిన ప్రత్యేక వాహనాల్లో ఏజెన్సీకి తరలించారు. పోలీస్ స్టేషన్ల విధ్వంసంతో తూర్పుగోదావరి, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నుంచి బలగాలను రప్పించి, ఏజెన్సీకి తరలించాలని నిర్ణయించారు.

అరకు, డుంబ్రిగుడ మండలాల ప్రజలు సంయమనం పాటించాలని విశాఖ జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ విజ్ఞప్తి చేశారు. ఆవేశంతో ఎటువంటి విధ్వంసాలకు పాల్పడవద్దని, ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల హత్యలపై పూర్తి స్ధాయిలో దర్యాప్తు చేయిస్తామని తెలిపారు. రానున్న రోజుల్లో మావోయిస్టులపై తీవ్రమైన చర్యలుంటాయని స్పష్టం చేశారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించవద్దని, దయచేసి సహకరించాలని కోరారు.