ప్రభాస్ పిటిషన్ పై హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్య

ప్రభాస్ పిటిషన్ పై హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్య

భూవివాదానికి సంబంధించి సినీ నటుడు ప్రభాస్ పిటిషన్‌ విచారణ సందర్భంగా హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. రీల్ లైఫ్‌లో విలన్లను ఎదుర్కొన్న బాహుబలి.. రియల్ లైఫ్‌లో విలన్లతో తలపడి ఉండరంటూ న్యాయస్థానం తెలిపింది.  సామాన్యుడి విషయంలో అయితే గతంలోనే తాము మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేవాళ్ళమని, కానీ, ప్రభాస్ విషయంలో ఆచితూచి వ్యవహరించామని హైకోర్టు స్పష్టం చేసింది. మరోవైపు తెలంగాణ ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ప్రభాస్ భూకబ్జాదారుడని ఆరోపించగా.. ఆ వ్యాఖ్యలపై హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. భూకబ్జాదారుడైనప్పటికీ అతనికి సెక్షన్ 17 కింద నోటీసులు ఇవ్వాల్సిందేనని న్యాయస్థానం స్పష్టం చేసింది. ప్రభాస్‌కు అనుకూలంగా తీర్పు ఇస్తే.. ఆ భూమిని కబ్జా చేసిన మిగతావాళ్ళు కూడా.. ఇందుకు అర్హులవుతారని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు నివేదించారు. అయితే, ప్రభాస్ తరఫు వాదనలు వినిపిస్తూ.. తాను కొనుగోలు చేసిన భూమిలోనే ప్రభాస్‌ గెస్ట్ హౌజ్‌ కట్టుకున్నారని తెలిపారు. ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది.