ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌కు స్వల్ప ఊరట

ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌కు స్వల్ప ఊరట

వేములవాడ టీఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ కు హైకోర్టులో ఊరట లభించింది. ఆయన పౌరసత్వాన్ని రద్దు చేసినట్లు ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ పౌరసత్వ రద్దు ఉత్తర్వులపై నాలుగు వారాల పాటు హైకోర్టు స్టే విధించింది. విచారణను డిసెంబర్ 16వ తేదీకి వాయిదా వేసింది. గతంలో హైకోర్టు ఉత్తర్వులను పట్టించుకోలేదని రమేష్ తరపు లాయర్ తెలిపారు. 12నెలలు ఇండియాలో ఉన్న తర్వాతే భారత పౌరసత్వం లభిస్తుందని ప్రతివాదులు తెలిపారు. ఇండియాలో ఏడాది ఉండకుండానే భారత పౌరసత్వం పొందారని ప్రతివాదులు తెలిపారు.

అన్ని అంశాలు పరిగణనలోకి తీసుకుని డిసెంబర్ 16న విచారిస్తామని హైకోర్టు తెలిపింది. కాగా,  చెన్నమనేని రమేశ్ భారత పౌరుడు కాదని, ఎన్నికల్లో పోటీ చేసేందుకు అర్హుడు కాదని కొందరు నేతలు గతంలో కోర్టును ఆశ్రయించారు. పౌరసత్వంపై కేంద్ర హోంశాఖ మాత్రమే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని హైకోర్టు  అప్పట్లో స్పష్టం చేసింది. అనంతరం సుప్రీంకోర్టులో కూడా ఇదే అభిప్రాయం వెల్లడించింది. ఈనేపథ్యంలో విచారణ చేపట్టిన కేంద్ర హోంశాఖ అన్ని వివరాలు పరిశీలించి, ఆయన భారత పౌరుడు కాదని, ఇక్కడ ఎలాంటి అధికారాలు పొందేందుకు అర్హుడు కాదని ప్రకటన చేసింది.