దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌లో మరో ట్విస్ట్..! రీపోస్టుమార్టంకు ఆదేశం..

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌లో మరో ట్విస్ట్..! రీపోస్టుమార్టంకు ఆదేశం..

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌లో కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది... ఆ నాలుగు మృతదేహాలకు రీపోస్టుమార్టం నిర్వహించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది తెలంగాణ హైకోర్టు... మృతదేహాల అప్పగింతపై విచారణ జరిపిన హైకోర్టు.. గాంధీ సూపరింటెండెంట్‌ నుంచి మృతదేహా పరిస్థితిపై ఆరా తీసింది. చీఫ్ జస్టిస్ ముందు హాజరైన గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రవణ్... మృతదేహాల భద్రతపై కోర్టుకు సమాచారం ఇచ్చారు. ఇప్పటికే మృతదేహాలు 50 శాతం కుళ్లిపోయాయని కోర్టుకు తెలిపిన ఆయన.. మైనస్ 2 డిగ్రీల సెల్సీయస్ ఫ్రీజర్‌లో మృతదేహాలను ఉంచాలని సూచించారు. అంతే కాదు.. మరో వారంపది రోజుల్లో మృతదేహాలు పూర్తిగా కుళ్లిపోయే పరిస్థితి ఉందని హైకోర్టుకు తెలిపారు గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్. 

ఇక, మృతదేహాలకు మళ్ళీ పోస్టుమార్టం నిర్వహించాలని ఆదేశించింది హైకోర్టు... అయితే, ఇప్పటికే పోస్టుమార్టం నిర్వహించామని కోర్టుకు తెలపగా... తెలంగాణాకు సంబంధం లేని నిపుణులైన డాక్టర్లతో ఈ పోస్టుమార్టం ప్రక్రియ పూర్తి చేయాలని వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపాల్ సెక్రెటరీని ఆదేశించింది హైకోర్టు... ఈనెల 23 సాయంత్రం 5 గంటలలోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని.. అనంతరం ఆ నాలుగు మృతదేహాలను వాళ్ల కుటుంబాలకు అప్పగించాలని హైకోర్టు తెలిపింది. దీంతో... ఎన్‌కౌంటర్‌ జరిగినప్పట్టి నుంచి వాయిదా పడుతూ వస్తున్న మృతదేహాల అంత్యక్రియలు ఈ నెల 23న లేదా 24వ తేదీన జరిగే అవకాశం ఉంది.