ఆర్టీసీ సమ్మె...సర్కార్ మీద హైకోర్టు సీరియస్

ఆర్టీసీ సమ్మె...సర్కార్ మీద హైకోర్టు సీరియస్

సమ్మె విషయంలో తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్ అయింది. ఆర్టీసీ సమ్మెకు సంబంధించి ఇవాళ విచారణ జరిగింది. ఈ సందర్భంగా గతంలో తాము చెప్పినట్టు ఆర్టీసీకి ఎండీని ఎందుకు నియమించలేదని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అయితే, ఎండీని నియమించడం వల్ల సమస్య పరిష్కారం కాదని, ఇప్పటికే సమర్థుడైన ఇన్‌చార్జి ఉన్నారని కోర్టుకు ప్రభుత్వం తరఫున న్యాయవాదులు సూచించారు. అయితే, అదే ఇన్‌చార్జి సమర్థుడైతే అతడినే ఎండీగా నియమించవచ్చు కదా అని కోర్టు ప్రశ్నించింది.

ఈ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రేపటి బంద్‌కు టీఎన్జీవోస్, ప్రైవేట్ క్యాబ్స్ మద్దతు తెలిపినందున ప్రభుత్వ చర్యలు ఏంటని హైకోర్టు ప్రశ్నించింది. ప్రజలు శక్తివంతులు, వాళ్లు తిరగబడితే ఎవరూ ఆపలేరని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఆర్టీసీ ఆర్థిక స్థితిపై ప్రభుత్వం కోర్టుకు నివేదిక సమర్పించింది. రెండు వారాలుగా ఆందోళనలు జరుగుతుంటే..ఎందుకు ఆపలేదని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది.

రేపటి బంద్‌కు ప్రభుత్వం అన్ని రకాలుగా సిద్ధంగా ఉందని ప్రభుత్వం తరపు న్యాయవాది తెలిపారు. కార్మికుల ఎక్కువ డిమాండ్లు పరిష్కరించదగ్గవేనని పేర్కొంది. ఆర్టీసీ ఎండీ నియామకం, హెచ్‌ఆర్‌ఏ పెంపు వంటి డిమాండ్లు న్యాయబద్ధమైనవి ధర్మాసనం పేర్కొంది. అయితే ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా కార్మికుల డిమాండ్లు నెరవేర్చడం సాధ్యం కాదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు ప్రభుత్వ న్యాయవాదులు. సంస్థ ఆర్థిక స్థితి వల్లే ఎండీ నియామకం చేయలేదని తెలిపారు.