జనగామలో తీవ్ర ఉద్రిక్తత..

జనగామలో తీవ్ర ఉద్రిక్తత..

జనగామ డీసీపీ కార్యాలయం దగ్గర తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. నిన్న సీఐ లాఠీఛార్జ్ లో గాయపడ్డ బిజెపి కార్యకర్తలు పరామర్శించడానికి ఈరోజు బండి సంజయ్ జనగామ వెళ్ళిన సంగతి తెలిసిందే. అయితే ఆయన జిల్లా ఆసుపత్రికి ర్యాలీగా వెళ్లడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మా పార్టీ కార్యకర్తలపై అన్యాయంగా లాఠీఛార్జి చేశారని బండి ఆరోపించారు. సీఐ పై చర్యలు తీసుకోకుంటే ఏం చేస్తామో చెప్పమన్న ఆయన చేసి చూపిస్తామని వార్నింగ్ ఇచ్చారు. తెలంగాణలో వివేకానంద జయంతిని ప్రభుత్వం ఏమైనా నిషేధించిందా ? అని ప్రశ్నించిన ఆయన జనగామ మున్సిపల్ కమిషనర్ మీద కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

జనగామ పోలీస్ స్టేషన్ ముందు నుంచి బండి సంజయ్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ కొనసాగింది. ఇక డీసీపీ కార్యాలయం మీద దాడికి బీజేపీ కార్యకర్తలు యత్నించారు. గేటు ఎక్కి లోపలికి వెళ్లేందుకు యత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. జనగామ ప్రభుత్వ ఆస్పత్రి వద్ద మీడియాతో బండి సంజయ్ మాట్లాడారు. జనగామలో వివేకానంద స్వామి ప్లెక్సీలను మున్సిపల్ కమిషనర్ కావాలనే తొలగించారన్న ఆయన మాకార్యకర్తలు శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే సీఐ, ఎస్సై ఇద్దరు చితకబాదారని అన్నారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి డైరక్షన్ లో పోలీసులు రెచ్చిపోతున్నారని, మా కార్యకర్తలను రక్తం కారేలా కొడుతున్నారని అన్నారు. ఆరేళ్లుగా ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ కే పరిమితం అయ్యారని ఆయన అన్నారు. స్వామి వివేకానంద జయంతిని జరిపితే సీఎంకు వచ్చిన ఇబ్బంది ఏంటీ..? అని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ మానవ మృగం అంటూ ఆరోపించిన అయన బీజేపీని అణచివేయాలని చూస్తే ఊరుకోబోమని అన్నారు. కేసీఆర్ ను రాజకీయ సమాధి చేయడమే నాలక్ష్యం అని ఆయన ప్రకటించారు. జనగామ మున్సిపల్ కమిషనర్, సీఐ, ఎస్సై వెంటనే సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. నీకొడుకు కొడితే బాధేంటో నీకు తెలుస్తుంది కేసీఆర్ అంటూ ఆయన కామెంట్ చేశారు.