కొడంగల్ లో ఉద్రిక్తత..

కొడంగల్ లో ఉద్రిక్తత..

వికారాబాద్‌ జిల్లాలోని కొడంగల్‌లో హైటెన్షన్ నెలకొంది. టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్, కొడంగల్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి రేవంత్‌రెడ్డి అరెస్ట్ కావడం, నియోజకవర్గ బంద్‌కు పిలుపునివ్వడంతో భద్రత కట్టుదిట్టం చేశారు. మరోవైపు నేడు కోస్గిలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సభ ఉండటంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ సభలో అల్లర్లు సృష్టించేందుకు రేవంత్‌ కుట్ర పన్నుతున్నారంటూ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు. సభకు జనం రాకుండా ఆటంకపరిచేందుకు ప్రయత్నిస్తున్నారని కూడా ఆయన ఫిర్యాదు చేయడంతో ఎన్నికల కమిషనర్‌ సీరియస్‌ అయ్యారు. దీంతో ఈ విషయంపై వెంటనే నివేదిక ఇవ్వాలంటూ డీజీపీ మహేందర్‌రెడ్డి, జిల్లా ఎస్పీ అన్నపూర్ణను ఆదేశించారు. ఎన్నికల ప్రధానాధికారి ఆదేశాలతో పోలీసు అధికారులు అడుగడుగునా భారీ భద్రత ఏర్పాటు చేశారు. కొడంగల్, కోస్గి వెళ్లే వాహనాలను క్షుణ్నంగా తనిఖీ చేస్తున్నారు. హైదరాబాద్‌–బీజాపూర్‌ రహదారులలో కొడంగల్, కోస్గిలకు వెళ్లే ప్రధాన రహదారులలో తనిఖీలు ముమ్మరం చేశారు. కొడంగల్‌ సెగ్మెంట్‌లో రెండు రోజుల పాటు 144 సెక్షన్‌ విధించినట్లు ఎన్నికల అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారి తెలిపారు.