సొంత పిల్లల్ని చంపిన భర్తకు క్షమాభిక్ష కోరిన భార్య

సొంత పిల్లల్ని చంపిన భర్తకు క్షమాభిక్ష కోరిన భార్య

వినడానికి ఇదో వింతైన కేసు. అమెరికాలోని సౌత్ కెరోలినాలో ఓ తండ్రి ఐదేళ్ల క్రితం తన ఐదుగురు పిల్లల్ని తన చేతులతోనే చంపేశాడు. భార్య అతనికి విడాకులు ఇచ్చేసింది. కానీ ఇప్పుడు అతనికి క్షమాభిక్ష ప్రసాదించాలంటూ కోర్టును కోరింది. ఆ కర్కోటక భర్తపై మాజీ భార్య మనసు మారిందేమో కానీ కోర్టు మాత్రం చలించలేదు. గురువారం అతని మరణశిక్ష విధించింది.

2012లో అంబర్ కైజర్ భర్త టిమోతీ జోన్స్ జూనియర్ నుంచి విడాకులు పొందింది. కోర్టు మేరా(8), ఎలియాస్(7), నాథన్(6), గాబ్రియెల్(2), అబిగెల్(1)ల సంరక్షణ బాధ్యతను టిమోతీకే ఇచ్చింది. కానీ రెండేళ్ల తర్వాత అతను వాళ్లందరిని చేజేతులారా చంపాడు. వాళ్ల మృతదేహాలను చెత్త బ్యాగుల్లో పెట్టి ఆ సంచులను అలబామాలోని ఒక మురికి రోడ్డుపై వదిలేశాడు.

మేలో ఈ కేసు విచారణ ప్రారంభమైంది. తనకు మతిస్థిమితం సరిగా లేనందువల్ల అలా చేశానని, తనకు శిక్ష విధించవద్దని జోన్స్ కోర్టును కోరాడు. అతనే ఈ నేరం చేశాడని ఈ నెల ఆరంభంలో నిర్ధారణ అయింది. అయితే తన మాదిరిగా మాజీ భర్త కుటుంబం కొడుకు లేని బాధ పడరాదని భావించిన కైజర్ అతనికి క్షమాభిక్ష ప్రసాదించాలని జ్యూరీని కోరింది. 

జోన్స్ చేతుల్లో తను పడ్డ బాధలను ఆమె ఏకరువు పెట్టింది. పిల్లల ముందు తనను కొట్టేవాడని, తిట్టేవాడని చెప్పింది. తన మొహంపై ఉమ్మేసి, తలను గోడకేసి కొట్టి, కత్తితో ముక్కలుగా కోస్తానని బెదిరించేవాడని తెలిపింది. జోన్స్ నానమ్మ, తండ్రి కూడా తమ బిడ్డకు మరణశిక్ష విధించవద్దని కోరారు. కానీ వీళ్ల వేడుకోళ్లకు కరగని కోర్టు నవంబర్ 30న అతనికి విషపు ఇంజెక్షన్ లేదా ఎలక్ట్రిక్ ఛెయిర్ తో మరణశిక్ష అమలు చేయాలని తీర్పు ఇచ్చింది.