గ్రేట‌ర్‌లో హోర్డింగ్‌లు, ఆర్చ్‌ల‌పై నిషేధం...

గ్రేట‌ర్‌లో హోర్డింగ్‌లు, ఆర్చ్‌ల‌పై నిషేధం...

గ్రేటర్ హైదరాబాద్‌లో హోర్డింగ్‌లు, ఆర్చ్‌లపై నిషేధం విధించారు అధికారులు... ప్రస్తుత వ‌ర్షాకాల సీజ‌న్‌ను దృష్టిలో పెట్టుకొని నేటి నుండి ఆగ‌ష్టు 14వ తేదీ వ‌ర‌కు గ్రేట‌ర్ హైద‌రాబాద్ న‌గ‌రంలో అన్ని ర‌కాల హోర్డింగ్‌లు, యూనిపోల్స్‌, ఆర్చ్‌లు, అబ్లీగేట‌రీ స్పాన్‌, ఫుట్ఓవ‌ర్ బ్రిడ్జిల‌పై ప్రక‌ట‌న‌ల‌ను నిషేధిస్తున్నట్టు జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ జ‌నార్థన్‌రెడ్డి ఆదేశాలు జారీచేశారు. ఇటీవ‌ల వ‌ర్షాలు, ఈదురు గాలులకు ప‌లు ప్రాంతాల్లో హోర్డింగ్‌లు, యూనిపోల్స్‌ల‌పై విన‌య‌ల్ ఫ్లెక్స్ బ్యాన‌ర్లు చినిగి వేలాడ‌డం జరిగిందని... వీటితో ట్రాఫిక్‌కు అంత‌రాయం క‌ల‌గ‌డంతో పాటు ర‌హ‌దారుల‌పై ప్రయాణించే న‌గ‌ర‌వాసులు ప్రమాదాల‌కు గుర‌య్యే అవ‌కాశం ఉంద‌ని ప్రభుత్వం ఆందోళ‌న వ్యక్తం చేసింద‌ని క‌మిష‌న‌ర్ తెలిపారు. న‌గ‌ర‌వాసుల భ‌ద్రత‌ను దృష్టిలో ఉంచుకొని ఆగ‌ష్టు 14వ తేదీ వ‌ర‌కు హోర్డింగ్‌లు, ఆర్చ్‌లు, యూనిపోల్స్‌ల‌తో పాటు అబ్లిగ్రేట‌రీస్పాన్‌, ఎఫ్‌.ఓ.బి, క్యాంటిలీవ‌ర్‌ల‌ను నిషేధిస్తున్నట్టు వెల్లడించారు.