ఇన్ఫోసిస్ ఫౌండేషన్ రిజిస్ట్రేషన్ రద్దు!!

ఇన్ఫోసిస్ ఫౌండేషన్ రిజిస్ట్రేషన్ రద్దు!!

విదేశీ నిధులు పొందేందుకు అవసరమైన నియమాలను ఉల్లంఘించిన కేసులో చర్యలు చేపడుతూ ఎన్జీవో ఇన్ఫోసిస్ ఫౌండేషన్ రిజిస్ట్రేషన్ ను హోమ్ మంత్రిత్వశాఖ రద్దు చేసింది. బెంగుళూరుకి చెందిన ఈ సంస్థపై చర్యలు చేపట్టినట్టు అధికారులు సోమవారం ప్రకటించారు. విదేశాల నుంచి సహాయం పొందే ఎన్జీవోలు విదేశీ విరాళాలు(రెగ్యులేషన్) చట్టం (ఎఫ్ సిఆర్ఏ) క్రింద నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అటువంటి ఏవైనా విరాళాల లెక్కలను ప్రతి ఏడాది ఆర్థిక సంవత్సరం ముగిసిన తొమ్మిది నెలల్లోగా ప్రభుత్వానికి అందజేయాలి. గత ఏడాది ఇన్ఫోసిస్ ఫౌండేషన్ కు హోమ్ మంత్రిత్వశాఖ షోకాజ్ నోటీస్ జారీ చేసినట్టు అధికారులు చెబుతున్నారు. 

గత కొన్నేళ్లుగా ఇన్ఫోసిస్ ఫౌండేషన్ సంస్థ విదేశీ నిధుల రాక, వ్యయానికి సంబంధించిన వార్షిక వివరాలను సమర్పించలేదు. పదే పదే రిమైండర్ లేఖలు జారీ చేసినప్పటికీ తగిన వివరణ ఇవ్వకపోవడంతో నోటీసులు జారీ చేయడమైంది. ఈ వ్యవహారంపై సంప్రదించినపుడు ఇన్ఫోసిస్ ఫౌండేషన్, తామే స్వయంగా తమ ఎఫ్ సిఆర్ఏ రిజిస్ట్రేషన్ రద్దు చేయాలని హోమ్ మంత్రిత్వశాఖను అభ్యర్థించామని చెప్పింది. ఆ తర్వాతే హోమ్ మంత్రిత్వశాఖ ఈ చర్య తీసుకున్నట్టు వివరించింది. 

1996 నుంచి విద్య, గ్రామీణాభివృద్ధి, వైద్య సేవలు, కళ, సాంస్కృతిక, ఇతర రంగాల్లో పనిచేస్తున్న షౌండేషన్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ రిషి బసు.. 2016లో ఎఫ్ సిఆర్ఏలో సవరణ జరిగిన తర్వాత తమ సంస్థ ఈ చట్టం పరిధిలోకి రాదని చెప్పారు. 'మేము మంత్రిత్వశాఖను సంప్రదించి దీనిపై పునరాలోచన చేయాలని కోరాము. మా అభ్యర్థనను అంగీకరించినందుకు మంత్రిత్వశాఖకు ధన్యవాదాలని' బసు తెలిపారు. ఇన్ఫోసిస్ వ్యవస్థాపక చైర్మన్ ఎన్ ఆర్ నారాయణమూర్తి భార్య సుధా మూర్తి ఈ ఫౌండేషన్ అధ్యక్షురాలిగా ఉన్నారు. గత ఏడాది 1,755 ఎన్జీవోలకు హోమ్ మంత్రిత్వశాఖ నోటీసులు ఇచ్చింది. వీటిలో కొన్ని కంపెనీలు కూడా ఉన్నాయి.