త్వరలో హువావీ సొంత స్మార్ట్ ఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్!?

త్వరలో హువావీ సొంత స్మార్ట్ ఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్!?

అమెరికా, చైనాల మధ్య జరుగుతున్న ట్రేడ్ వార్ టెక్ వార్ గా మారి తారస్థాయికి చేరుకుంది. టెక్ దిగ్గజ సంస్థ గూగుల్, హువావీ ఉత్పత్తులకు తమ సేవలు నిలిపేస్తున్నట్టు ప్రకటించింది. అంటే మరికొన్ని వారాల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న హువావీ ఫోన్లు, టాబ్లెట్లు జీమెయిల్, గూగుల్ డ్రైవ్, గూగుల్ కీప్, ప్లే స్టోర్ వంటి అనేక సేవలను పొందలేవు. అయితే హువావీ ఈ చర్యతో వెనక్కి తగ్గేలా లేదు. ప్రస్తుతం ఉన్న హువావీ, హానర్ ఫోన్లకు తమ సెక్యూరిటీ ప్యాచ్ లు, విక్రయానంతర సేవలను అందిస్తామని ప్రకటించింది. అమెరికా ప్రభుత్వం గూగుల్ సర్వీసులు పొందేందుకు హువావీకి 90 రోజుల గ్రేస్ పీరియడ్ కూడా ఇచ్చింది. ఈ మేరకు అమెరికా వాణిజ్య విభాగం ప్రకటన వెలువరించింది. 

కానీ హువావీ ఇలాంటి పరిస్థితి భవిష్యత్తులో ఎప్పటికైనా వస్తుందని ఊహించిందేమో! 2012 నుంచి తన సొంత మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ ను అభివృద్ధి చేస్తూ వచ్చింది. హువావీ హాంగ్ మెంగ్ ఓఎస్ పేరుతో తన సొంత ఆపరేటింగ్ సిస్టమ్ ను తయారుచేసినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఓఎస్ ప్రయోగాత్మక దశలో ఉన్నట్టు కథనాలు వస్తున్నాయి. త్వరలోనే ఆండ్రాయిడ్ ఓఎస్ స్థానంలో దశలవారీగా హువావీ నియంత్రిత వ్యవస్థ రాబోతున్నట్టు చెబుతున్నారు. గతంలో ఒక ఆపరేటింగ్ సిస్టమ్ ను తయారుచేయడంలో ఎదురయ్యే సవాళ్ల గురించి ఒక హువావీ ప్రతినిధి ప్రస్తావించారు. తమ ఆపరేటింగ్ సిస్టమ్ కి అనుగుణంగా యాప్స్ తయారుచేసేలా డెవలపర్స్ ని ఒప్పించడం వాటిలో ముఖ్యమైనది. 

దీనికి ముందు హువావీ తన ప్రాసెసర్ల పేరుతోనే కిరిన్ ఓఎస్ అనే సొంత ఆపరేటింగ్ సిస్టమ్ తయారు చేస్తున్నట్టు పుకార్లు షికారు చేశాయి. ఈ సందర్భంగా చైనా మొబైల్‌ ఫోన్ల తయారీదారైన హువావీ అమెరికాపై మండిపడింది. దీనిపై హువావీ వ్యవస్థాపకుడు రెన్‌ జెంగ్‌ఫీ గట్టిగానే స్పందించాడు. తమని తక్కువ అంచనా వేయొద్దని హెచ్చరించాడు. ‘మా బలాన్ని’ తక్కువగా అంచనా వేసి అమెరికా నేతలు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని చైనీస్‌ ప్రభుత్వ మీడియా సంస్థ సీసీటీవీతో అన్నారు.