మనుషులెందుకు ఇలా తయారయ్యారు ?

మనుషులెందుకు ఇలా తయారయ్యారు ?

సృష్టిలో జీవజాతులు అనేకమున్నాయి. జీవాల మధ్య సారూప్యం లేకున్నా ప్రకృతిలో కలిసిమెలిసి జీవించడం సాధారణం. కొన్ని జీవాల మధ్య విరోధం ఉంటే మరికొన్ని జీవాల మధ్య ప్రేమ ఉంటుంది. కానీ మనిషి జంతువుల విషయంలో చూపిస్తున్న కాఠిన్యం చర్చనీయాంశంగా మారింది. ఈ రోజుల్లో మనుషుల్లో పెరిగిపోతున్న హింసా ప్రవృత్తి మానవత్వాన్ని ప్రశ్నార్ధకం చేస్తున్నాయి. తాజాగా చిత్తూరు జిల్లా పెదపంజాని మండలం కొగిలేరులో వేటగాళ్ల అమానుషానికి ఓ గోవు నరకయాతన అనుభవిస్తోంది. 

పండులో ఉంచిన నాటుబాంబును నోటితో అందుకుందీ ఆవు. నాటు బాంబు పేలడంతో ఆవునోటికి తీవ్రగాయాలయ్యాయి. నోటి నుంచి తీవ్ర రక్తస్రావం అవుతుండడంతో.. ఆవు వేదన వర్ణనాతీతంగా ఉంది. ఈ ఆవును పశువైద్యశాలకు తరలించి చికిత్స చేశారు. కొగిలేరు దగ్గర సాకార్డు అనే స్వచ్చందసంస్థ నిర్వహిస్తున్న శ్రీకృష్ణ గోమాత పీఠానికి చెందిన ఆవుగా అధికారులు గుర్తించారు.

ఇక నిన్న కాక మొన్న ఇంటి ఆవరణలోని నీటి తొట్టిలోకి కోతి వచ్చిందన్న కోపంతో దాన్ని కసితీరా కొట్టి... ఉరివేసి చంపిన దారుణ ఘటన ఖమ్మం జిల్లాలో జరిగింది. వేంసూరు మండలం అక్కపాలెం గ్రామంలో సాదు వేంకటేశ్వరరావు  ఇంటి అవరణలోని నీటి తొట్టిలోకి ఓ కోతి వచ్చింది. ఇంటి ఆవరణలోకి కోతి వచ్చిందన్న కోపంతో దాన్ని బంధించి ఉరి వేశాడు. అంతటితో ఆగకుండా అది బాధతో విలవిల్లాడుతుండగా కుక్కలతో కరిపించి మరీ చంపించాడు. ఈ అమానవీయ ఘటనపై ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. మూగజీవిని దారుణంగా హింసించి చంపిన నిందితుల్ని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.

ఇక కొన్ని రోజుల క్రితం కేరళలో కూడా ఓ ఏనుగు పటాసులు అమర్చిన పైనాపిల్ తిని తీవ్రంగా గాయపడింది. దాదాపు రెండు వారాల పాటు నరక యాతన అనుభవించింది. చివరకూ ఓ నదిలోకి దిగి సేదదీరేందుకు యత్నించింది. చివరకు మృత్యువుతో పోరాడి ప్రాణాలు విడిచింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. ఈ వరుస ఘటనలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.