భార్య, ఇద్దరు పిల్లలను అమ్మకానికి పెట్టాడు..

భార్య, ఇద్దరు పిల్లలను అమ్మకానికి పెట్టాడు..

వరుసగా ఆడపిల్లలకు జన్మనిచ్చిందన్న కక్షతో భార్యసహా ఇద్దరు కుమార్తెలను రూ. 3 లక్షలకు అమ్మకానికి పెట్టాడో భర్త. ఫిర్యాదు చేసినా చాంద్రాయణగుట్ట పోలీసుల పట్టించుకోవడం లేదని బాధితురాలు ఆరోపించారు. ఆదివారం మలక్‌పేటలోని పీయూసీఎల్‌ కార్యాలయంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జయవింధ్యాలతో కలిసి విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించింది. ఫజల్‌ రహ్మాన్‌(25), ఇజరత్‌ పర్వీన్‌(22)కు మూడేళ్ల క్రితం వివాహం అయింది. వీరికి రెండేళ్ల పాప ఉండగా.. నాలుగు నెలల క్రితం ఆడపిల్లకు జన్మనిచ్చింది. కొడుకు పుట్టలేదన్న కక్షతో తల్లిదండ్రులతో కలిసి ఆమెను నిత్యం వేధించేవాడు. పథకం ప్రకారం మూడు నెలల క్రితం షాద్‌నగర్‌లో బంధువుల వివాహం ఉందని చెప్పి తల్లిదండ్రులతో కలిసి వెళ్లాడు. తిరిగి ఇంటికి రాలేదు. ఫోన్‌ చేస్తే సమాధానం ఇవ్వకుండా తప్పించుకు తిరుగుతున్నారు. అప్పటి నుంచి పర్వీన్‌ ఇంట్లో ఒంటరిగా ఉంటోంది. 

కాగా, మూడు రోజుల క్రితం బేగంపేటకు చెందిన సర్ఫరాజ్‌, అమ్జాద్‌ ఖాన్‌, మరో వ్యక్తి ఇంట్లోకి చొరబడ్డారు. రహ్మాన్‌ నిన్ను, ఇద్దరు పిల్లలను రూ. 3 లక్షలకు అమ్మేశాడని వారు డిమాండ్‌ చేశారు. కిడ్నాప్‌ చేసేందుకు యత్నించగా కేకలు వేసింది. చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకొని డయల్‌ 100కు ఫోన్‌ చేశారు. పోలీసులు అక్కడికి చేరుకొని ముగ్గురినీ అదుపులోకి తీసుకున్నారు. ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోకుండా వదిలేశారని బాధితురాలు తెలిపారు. కిడ్నాప్‌ చేసేందుకు వచ్చిన వారు, భర్త, అత్తమామలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేసింది.