హైదరాబాద్ కి చెందిన బీఎన్ఆర్ ఇన్ఫ్రా&లీజింగ్ పై సీబీఐ కేసు

హైదరాబాద్ కి చెందిన బీఎన్ఆర్ ఇన్ఫ్రా&లీజింగ్ పై సీబీఐ కేసు

హైదరాబాద్ కి చెందిన నిర్మాణ, లీజింగ్ సంస్థ ప్రమోటర్లపై సీబీఐ సోమవారం కేసు నమోదు చేసింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను మోసం చేసి రుణాలు తీసుకొన్నారని, అవి నిరర్థక ఆస్తులుగా మారడంతో ఎస్బీఐకి రూ.8.20 కోట్ల మేర నష్టం వాటిల్లినట్టు అధికారులు చెప్పారు. 

బీఎన్ఆర్ ఇన్ఫ్రా &లీజింగ్ లిమిటెడ్ కంపెనీపై, దాని ప్రమోటర్లు బి నరసింహా రెడ్డి, ఎస్ బిందుసాగర్ రెడ్డి, న్యాయవాదులు నెల్లుట్ల జగన్, వి నరసింగ రావు, డి ప్రభాకర రెడ్డి, మూల్య నిర్ధారకులు (వాల్యువర్) ఎన్ దత్తాత్రేయుడు, ఎల్ కిషోర్ చంద్ లపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు సీబీఐ అధికారులు తెలిపారు. వారిపై ఐపీసీలోని నేరపూరిత కుట్ర, మోసం, ఫోర్జరీ, ఇతర సెక్షన్ల కింద నేరాలు మోపినట్టు తెలిసింది. 

ఎస్బీఐ ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. ఎస్బీఐ తన ఫిర్యాదులో కంపెనీకి రూ.2 కోట్ల క్యాష్ క్రెడిట్ సౌకర్యం ఇచ్చినట్టు పేర్కొంది. అలాగే 2011లో ప్రొప్రైటర్ బి నరసింహా రెడ్డి పేరిట ఉన్న 16,940 చదరపు గజాల భూమిని బదులుగా రూ.1 కోటి వరకు బ్యాంక్ గ్యారంటీ ఇచ్చినట్టు తెలిపింది. ఆ తర్వాత ఆయన ఇచ్చిన ఇతర అనుషంగిక సెక్యూరిటీల ఆధారంగా క్రెడిట్ సౌకర్యాలను పెంచినట్టు చెప్పింది. 

బిందుసాగర్ రెడ్డిని భాగస్వామిగా చేర్చుకున్న తర్వాత అది భాగస్వామ్య కంపెనీగా మారింది. 2015లో కంపెనీ తీసుకున్న రుణాలు రూ.8.20 కోట్లతో సహా నిరర్థక ఆస్తులుగా ప్రకటించడం జరిగింది. రుణాల రికవరీ కోసం సర్ఫేసీ చట్టం కింద ప్రక్రియ చేపట్టిన బ్యాంకుకు తన దగ్గర అనుషంగిక సెక్యూరిటీ పత్రంగా తనఖా పెట్టిన పత్రం పనికి రానిదని, బ్యాంకు తన మొత్తాన్ని వసూలు చేయలేదని తెలిసింది. 

ప్రమోటర్లు ఫోర్జరీ పత్రాలతో వ్యవసాయేతర భూమిగా చూపించారని బ్యాంక్ ఆరోపించింది. అలాగే మూల్యనిర్ధారణ నివేదికను కూడా తారుమారు చేసి ఆ ఆస్తి విలువను రూ.4.66 కోట్లుగా చూపించారు. బ్యాంకు విలువదారులు సైతం అనుషంగికంగా సమర్పించిన ఆస్తులు వ్యవసాయేతరమని మోసపూరిత నివేదికలను సమర్పించినట్టు ఆరోపించింది.