అటు నోట్ల రద్దు.... ఇటు రూ. 3,178 కోట్లు జమ

అటు నోట్ల రద్దు.... ఇటు రూ. 3,178 కోట్లు జమ

నోట్ల రద్దు సమయంలో వేల కోట్ల రూపాయలు బ్యాంకుల్లో జమ అయినట్లు వార్తలు వస్తున్నాయి. అదే సమయంలో హైదరాబాద్‌ అడ్డాగా కూడా చాలా కంపెనీలు భారీ ఎత్తున నగదును బ్యాంకుల్లో జమ చేసినట్లు కేంద్ర ప్రభుత్వ గుర్తించింది. దేశంలో నోట్ల రద్దు సమయంలో కంపెనీల్లో భారీ ఎత్తున నగదు జమ అయిన కంపెనీల జాబితాను కేంద్రం తయారు చేసింది. విచిత్రమేమిటంటే అందులో టాప్‌లో ఉన్న కంపెనీ హైదరాబాద్‌కు చెందినది కావడం. నోట్ల రద్దు సమయంలో ఈ కంపెనీలో ఏకంగా రూ. 3,178 కోట్లు జమ కావడం, తరవాత విత్‌ డ్రా కూడా చేయడం జరిగింది. ఈ వ్యవహారంపై విచారణ జరపాల్సిందిగా సీరియస్‌ ఫ్రాడ్‌ ఇన్వెస్టిగేషన్‌ ఆర్గనైజేషన్‌ (ఎస్‌ఎఫ్‌ఐఓ)ను ఆదేశించింది కేంద్రం. తెలుగు రాష్ట్రాలకు చెందిన రిజిస్ట్రార్‌ ఆఫ్‌ కంపెనీకి చెందిన అధికారితో పాటు ఎస్‌ఎఫ్‌ఐఓకు చెందిన మరో అధికారి ఈ కంపెనీకి సంబంధించి విచారణ ప్రారంభించారు.

అంతా ముంబై నుంచే...
 హైదరాబాద్‌లోని ఎర్రగడ్డ వద్ద గోకుల్‌ సినిమా థియేటర్ పక్కవీధిలో ఎన్‌ శిద్ధప్ప నిలయం అనే పేరుతో చిన్న అపార్ట్‌మెంట్‌ ఉంది. అందులోని ఓ ఫ్లాట్‌ అడ్రస్‌తో 2012 ఫిబ్రవరిలో డ్రీమ్‌లైన్‌ మ్యాన్‌పవర్‌  సొల్యూషన్స్‌  ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరుతో హైదరాబాద్‌కు చెందిన అతుల్‌ బిస్తి, అంకుర్‌ బిస్తి, భాస్కర్‌ పాండేలు కంపెనీని నెలకొల్పారు. లక్షల రూపాయల మూలధనంతో ఏర్పాటు చేసిన ఈ కంపెనీ ప్రధాన ఉద్దేశం ఐటీ కంపెనీల తరఫున రిక్రూట్‌మెంట్‌లు చేయడం. కానీ.. పెట్టిన ఏడాదికే ఈ కంపెనీ చేతులు మారింది. ముంబైకి చెందిన సావంత్‌ ప్రకాష్‌ తుకారాం, ఇంగలే హితేష్‌ మనోహర్‌ లాల్‌ ఈ కంపెనీని 2013 టేకోవర్‌ చేశారు. ప్రస్తుతం సూరజ్‌ కుమార్‌ యాదవ్‌, హితేష్‌ మనోహర్‌ ఇంగలే డైరెక్టర్లుగా ఉన్నారు. ఈ కంపెనీలో నోట్ల రద్దు సమయంలో రూ.3,178 కోట్లు డిపాజిట్‌ చేయడంతో పాటు విత్‌డ్రా చేసినట్లు కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. వివిధ కంపెనీల నుంచి ఈ కంపెనీలో భారీగా నిధులు కూడా వచ్చాయి. ఎస్‌ బ్యాంక్‌ కూడా ఈ కంపెనీకి భారీగా రుణాలు ఇచ్చింది. కేవలం ట్యాక్స్‌ కన్సల్టింగ్‌ సేవలు అందించే ఈ కంపెనీకి ఇంత భారీ ఎత్తున నిధులు ఎందుకు వచ్చాయి? ఎలా వచ్చాయన్నది అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

పేరు మార్పు..
కంపెనీపై ఎస్‌ఎఫ్‌ఐఓ దర్యాప్తు ప్రారంభించేందుకు ఆదేశాలు జారీ అయిన ఒక రోజు ముందే ఈ కంపెనీ పేరును నిత్యంత్‌ ఇన్‌ఫ్రా పవర్‌ అండ్‌ మల్టి వెంచర్స్‌ లిమిటెడ్‌గా మార్చారు. నిధుల సరఫరా కోసమే హైదరాబాద్‌ కేంద్రంగా రిజిస్టరయిన  ఈ కంపెనీని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. కొనుగోలు తరవాత కూడా ముంబై యజమానులు పాత అ్రడస్‌నే కొనసాగిస్తున్నారు. వాస్తవానికి ఈ కంపెనీ చెబుతున్న అడ్రస్‌లో ఎలాంటి కార్యకలాపాలు లేవు. ఈ అపార్ట్‌మెంట్‌లోని వారికి కూడా ఇలాంటి కంపెనీ ఈ అడ్రస్‌తో ఉందన్న విషయం తెలిసిందే. అయితే కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ అధికారులు మాత్రం ఈ కంపెనీలో నిధుల బదిలీకి సంబంధించి కంపెనీ డైరెక్టర్లు సమాధానం ఇచ్చారని అంటున్నారు. ఎస్‌ఎఫ్‌ఐఓ దర్యాప్తులో భాగంగా డిపాజిట్లు, విత్‌డ్రాయిల్స్‌కు సంబంధించిన వివరాలు తమకు ఇచ్చారని, ఇందులో ఎలాంటి మతలబు లేదని అధికారులు అంటున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. మరి ఏ పనీపాటా లేని కంపెనీలోకి వేల కోట్లు ఎలా వచ్చి వెళ్ళాయనేది రహస్యంగానే మిగిలిపోయింది.