హెచ్‌సీఏలో డబ్బులను దోచుకోవడంపైనే ఫోకస్‌...

హెచ్‌సీఏలో డబ్బులను దోచుకోవడంపైనే ఫోకస్‌...

దేశంలో క్రికెట్‌కి ఉన్నంత క్రేజు మరే క్రీడకు లేదు..! పైగా బీసీసీెఐ సంపన్న క్రికెట్‌ సంఘం..! ఇక్కడి నుంచి కోట్ల రూపాయలు రాష్ట్రాల అసోసియేషన్‌లకు వస్తాయి..! క్రికెట్‌ను అభివృద్ది చేసేందుకు.. కొత్త క్రికెటర్లను తయారు చేసేందుకు..! కానీ హెచ్‌సీఏలో జరుగుతుంది వేరు..! అక్కడ అవినీతి కంపు కొడుతోంది..! అధ్యక్షులు, ప్యానెళ్లు మారుతున్నా.. కరప్షన్‌ మాత్రం తగ్గడం లేదు. కోట్ల రూపాయలను మింగేస్తున్నారు..! హెచ్‌సీఏ అవినీతి మళ్లీ తెర మీదికి వచ్చింది. టీమిండియా మాజీ కెప్టెన్‌ అధ్యక్షుడైనా.. అదే పరిస్థితి నెలకొంది..! దీంతో అవినీతిపై అసోసియేషన్‌ సభ్యులే మండిపడుతున్నారు..! 

అసోసియేషన్‌ సొమ్మును మెక్కి తినడమేనా..? 

హెచ్‌సీఏ.. హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌..! ఇప్పటికీ జయసింహ, లక్ష్మణ్‌, అంబటిరాయుడు గురించే మాట్లాడుకుంటున్నాం..! కొత్త క్రికెటర్‌ రావడం లేదు. ఆ దిశగా ఎంకరేజ్‌మెంట్‌ ఉండదు..! క్రికెట్‌ కోసం.. కొత్త ఆటగాళ్లను తీర్చిదిద్దుతామంటూ చెప్పే మాటలకు పొంతనే లేదు..! ఇష్టానుసారంగా అసోసియేషన్‌ సొమ్మును మెక్కి తినడం అలవాటైపోయింది. హెచ్‌సీఏ అవినీతి కంపు కొడుతోంది.  

టెండర్లుండవ్‌.. ఆడిటింగ్‌ ఉండదు.. అంతా అవినీతి

హెచ్‌సీఏలో ఎలాంటి టెండర్లుండవ్.. ఆడిటింగ్ ఉండదు. అంతా అవినీతి, విచ్చలవిడితనం.. అప్పులతో రోజులు గడిపే బీ గ్రేడ్  స్ధాయికి తీసుకొచ్చారు. HCA  వ్యవహారంపై విమర్శల దాడి పెరుగుతోంది. సభ్యుల నుంచే బాణాల్లాంటి ప్రశ్నలు దూసుకొస్తున్నాయ్‌..! కొత్త టాలెంట్‌ని వెతికిపెట్టడం పక్కనపెడితే.. అసలు ప్రతిభ ఉన్న వారిని పట్టించుకుంటున్న పాపాన పోలేదు. బంధుప్రీతి, అవినీతి ఈ రెండు అసోసియేషన్‌ను భ్రష్టు పట్టిస్తున్నాయని విమర్శలు గుప్పిస్తున్నారు.  

నిధులు దేనికి ఖర్చు పెట్టారో చెప్పే నాధుడు లేడు..!

హెచ్‌సీఏలో ఓ లెక్కా పత్రం లేదు. బీసీసీఐ నుంచి వస్తోన్న కోట్ల రూపాయల నిధులు దేనికి ఎంత ఖర్చు పెట్టారో చెప్పే నాధుడు ఉండడు. టెండర్లు లేకుండానే కోట్ల రూపాయల పనులు జరిగిపోతుంటాయ్‌. ఈ ముసుగులో జేబులు నింపుకునే వాళ్లు కొందరు..! ఈ దందా యథేచ్చగా సాగిపోతోంది.   

ఆఖరికి స్టేడియానికి ట్యాంపరింగ్‌ కరెంట్‌

హెచ్‌సీఏ పరిస్థితి అడుక్కుతినే స్థాయికి దిగజారింది. ఆఖరికి స్టేడియానికి కరెంట్‌నూ  ట్యాంపరింగ్‌తో వాడుకుంటుండటంతో.. పెనాల్టీలు పడ్డాయ్‌. ఆ దెబ్బతో 15 రోజుల పాటు ఉప్పల్ క్రికెట్ స్టేడియానికి కరెంట్ సరఫరా ఆగిపోయింది. అయినా కదలిక లేదు..! పరువు పోతుందన్న పట్టింపు లేదు..!

అక్కడంతా ఓ స్టయిల్‌ దందా..! వచ్చే డబ్బులను ఎలా నొక్కేయాలనే ప్లాన్‌లు..! వందలు ఖర్చయ్యే పనిని వేలు చేస్తారు. వేలల్లో ఉండే పనికి లక్షలు...లక్షల్లో పూర్తయ్యే పనికి  కోట్లల్లో దండుకుంటున్నారు..! ఇదేదో ఒకటి, రెండు సార్లు అనుకుంటే పొరపాటే..! ప్రతి పనికి ఇదే విద్యను వాడుతున్నారు. అందినకాడికి దోచుకుంటున్నారు. 

ఖరీదైన లీగ్‌లు నిర్వహించే హెచ్‌సీఏ... వాటికోసం విచ్చలవిడిగా ఖర్చు చేస్తోంది. అసోసియేషన్‌ లెక్కలు చూసే ఆడిటర్లు సైతం.. వీటిని సరిచేయడం మా వల్ల కాదంటూ చేతులెత్తేశారు. అసోసియేషన్‌ ఖజానాకు కన్నం వేసి.. దొరికిందంతా దోచుకుంటున్నారు. ఎన్నిసార్లు ఎన్నికలు జరిగినా.. ప్యానెళ్లు మారినా.. కొత్త అధ్యక్షుడు వచ్చినా.. అక్కడంతే..! ఏం మారదు..! మారుతుందన్న ఆశ కనిపించదూ..! దండుకోవడమే అక్కడ అసలు పని..! ఆటను, ఆటగాళ్లను ఎప్పుడో గాలికి వదిలేశారు.