క్రికెటర్లను కాపాడుకోలేకపోతున్న హెచ్‌సీఏ

క్రికెటర్లను కాపాడుకోలేకపోతున్న హెచ్‌సీఏ

తెలంగాణలోని టాలెంట్‌ను గుర్తించి.. వారిని ప్రొత్సహించి.. అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే బాధ్యత హెచ్‌సీఏది..! కానీ ఎంత మంది క్రికెటర్లను తీర్చిదిద్దింది. అసలు రంజీ కప్‌ గెలిచి ఎన్నాళ్లైందో తెలుసా..? ఓ వైపు కర్నాటక, తమిళనాడులో యంగ్ టాలెంట్‌ను ఎంకరేజ్‌ చేస్తుంటే.. హెచ్‌సీఏ మాత్రం ఉన్న వాళ్లను కనీసం గుర్తించలేని స్థితిలో ఉంది. 

సిరాజ్‌ను పట్టించుకోని హెచ్‌సీఏ

మహమ్మద్ సిరాజ్‌.. ఇప్పుడు టీమిండియాలో ఓ సంచలనం..! ఆస్ట్రేలియా టూర్‌లో అద్భుతంగా ప్రదర్శన చేశాడు. హైదరాబాదీ అని చెప్పుకోవడానికి అందరూ గర్వపడుతున్నా.. హెచ్‌సీఏ మాత్రం సరాజ్‌ని పట్టించుకోలేదు. హెచ్‌సీఏ ప్రెసిడెంట్‌గా ఉన్న టీం ఇండియా మాజీ కెప్టెన్‌ అజారుద్దీన్‌ కనీసం ట్వీట్‌ కూడా చేయలేదు. అసలు సిరాజ్‌ ఏదో హైదరాబాదీ వాడు కాదన్నట్లుగా వ్యవహారించింది. 

ఉన్న క్రికెటర్లను కాపాడుకోలేకపోతున్న హెచ్‌సీఏ

క్రికెటర్లను సృష్టించడం ఎలాగో హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ కు చేతకాదు. కనీసం ఉన్న క్రికెటర్లను కూడా కాపాడుకోలేకపోతోంది. టీం ఇండియా ప్లేయర్‌... ఐపీఎల్‌ స్పెషలిస్ట్‌... అంబటి రాయుడు పుట్టిపెరిగింది. బ్యాట్‌ పట్టింది.. హైదరాబాద్‌లోనే. హైదరాబాద్‌ రంజీ టీం నుంచే.. టీం ఇండియాకు ఎంపికయ్యాడు. అలాంటి రాయుడుని ఏనాడు పట్టించుకోలేదు హెచ్‌సీఏ. విసిగెత్తిన రాయుడు.. ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌కు వెళ్లిపోయాడు. బవనాక సందీప్‌... ఇండియన్‌ ఫస్ట్‌ క్లాస్‌ క్రికెటర్‌. రంజీ ట్రోఫీ లో హైదరాబాద్‌ తరఫున 4 మ్యాచుల్లో 400 రన్స్‌ చేసిన వన్‌ అండ్‌ ఓన్లీ బ్యాట్స్‌మెన్‌. సందీప్‌ను హెచ్‌సీఏ పట్టించుకోకపోవడంతో గోవా క్రికెట్‌ అసోసియేషన్‌కు వెళ్లిపోయాడు. లోకల్‌ కుర్రాళ్లు అద్భుత ప్రదర్శన చేసినా.. రాజకీయాలు తొక్కేస్తాయ్‌..! టాలెంట్ ఉన్న ఆటగాళ్లకు అవకాశాల్లేకుండా పోతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. 

హనుమ విహారి సంగతే మరిచిపోయిన హెచ్‌సీఏ

హనుమ విహారీ అంతే..! తన గేమ్‌ తాను ఆడుకోవడమే గానీ.. హెచ్‌సీఏ కార్యకలాపాల్లో ఏనాడు జోక్యం చేసుకోలేదు. విహారిని ప్రోత్సహించడం కాదు కదా... విహారి అనే ఒక ప్లేయర్‌ ఉన్నాడన్న సంగతి కూడా హెచ్‌సీఏ  మరిచిపోయింది. ఆస్ట్రేలియా సిరీస్‌లో అదరగొట్టిన నటరాజన్‌కు తమిళనాడులో ఘన స్వాగతం పలికింది. నటరాజన్‌ బయోగ్రఫీ ఆధారంగా సినిమా కూడా రాబోతోంది. కానీ అలాంటి గుర్తింపు మన దగ్గర లేదు. కనీసం పలకరించేందుకు కూడా హెచ్‌సీఏ పెద్దలకు తీరిక కుదర్లేదు..! 

హెచ్‌సీఏలో రెండేళ్లకోసారి జరిగే ఎన్నికలు.. అసెంబ్లీ ఎన్నికలను తలపిస్తాయి. ఒకరిపై ఒకరు ఆరోపణలు గుప్పించుకుంటారు. అంతర్గత కుమ్ములాటలు.. దాడులు.. కేసులు. ఫ్యానెళ్లు మారినా.. అధ్యక్షులు మారుతున్నా... హెచ్‌సీఏ తీరు మాత్రం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లు ఉంటుంది. ఇప్పటికే హెచ్‌సీఏ అంటే హైదరాబాద్‌ కరెప్షన్‌ అసోసియేషన్‌గా ముద్ర పడిపోయింది. నిజానికి అజారుద్దీన్‌ రాకతో క్రికెట్‌కి మంచిరోజులు వస్తాయని భావించారు. టాలెంట్‌ ఉన్న ఆటగాళ్లకి మహర్దశ పడుతుందని అనుకున్నారు. కానీ ఏం మారింది..? ఏం మారలే..! ఇప్పుడు అజార్‌ను సొంత ప్యానెల్‌ వాళ్లే వ్యతిరేకిస్తున్నారు. అధ్యక్షుడు అయ్యాడే తప్ప.. ఏనాడు బాధ్యతగా వ్యవహరించలేదన్న విమర్శలు వస్తున్నాయ్. 

అంతేకాదు.. మహ్మద్‌ సిరాజ్‌ ఆస్ట్రేలియా టూర్‌లో ఉండగా అతని తండ్రి గౌస్‌ అనారోగ్యంతో చనిపోయాడు. సిరాజ్‌ రాలేకపోయాడు. దీనిపై గంగూలీ  కూడా స్పందించాడు. కానీ హెచ్‌సీఏ తరఫున ప్రెసిడెంట్‌ కాకపోయినా కనీసం సభ్యుడైనా సిరాజ్‌ ఇంటికి వెళ్లి పరామర్శించారా..? అంటే అదీ లేదు..! అంటే కొత్త క్రికెటర్‌ను తయారు చేయడం రాదు..! ఉన్న క్రికెటర్లను గౌరవించడం తెలియదు..! సీనియర్లను పట్టించుకునే తీరిక ఉండదు..! మనకేంటి..? అనే సోయి తప్ప... క్రికెట్‌ని ఉద్దరించాలనే ధ్యాస ఎక్కడుంది..? ఈ విమర్శలే ఇప్పుడు హెచ్‌సీఏను నిలదీస్తున్నాయ్‌..! 
500 రూపాయల శాలువా, దండ తీసుకురావాలన్న సవాలక్ష రాజకీయాలుంటాయి అంటారు ఓ హెచ్‌సీఏ సభ్యుడు.  అసోసియేషన్‌ నిండా ఇవే కుమ్ములాటలు. ఇలాగే సాగిపోతోంది..!