చెవులు చిల్లులు పడుతున్నాయి....

చెవులు చిల్లులు పడుతున్నాయి....

నగరవాసి చెవులు చిల్లులు పడుతున్నాయి... అంతకంతకూ ధ్వని కాలుష్యం పెరిగిపోతుండడంతో కలవరపడుతున్నాడు. తాజాగా అత్యంత ధ్వని కాలుష్య నగరాల జాబితాలో హైదరాబాద్ సిటీకి మూడోస్థానం వచ్చిందంటే మన సిటీలో ధ్వని కాలుష్య పరిస్థితి ఏంటో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. మెట్రోపాలిటన్ నగరాల జాబితాలో హైదరాబాద్‌ థర్డ్ ప్లేస్‌లో ఉంది. టెక్ పరిశ్రమ కలిగి ఉన్న మన నగరం... టాప్ 10 కలుషిత మెట్రోపాలిటన్ నగరాల్లో జాబితాలోనూ చేరింది. హైదరాబాద్‌ వాణిజ్యం, టెక్నాలజీ పరిశ్రమలో విపరీతమైన పెరుగుదలను చూపిస్తోంది... ఫలితంగా, జనాభాలో భారీ పెరుగుదల, అధిక జనసాంద్రత, ట్రాఫిక్, రాత్రి సమయంలోనూ రద్దీ కారణంగా సౌండ్ స్థాయిలు అన్ని సమయాల్లో అధిక స్థాయిలో నమోదయ్యాయి.

ఎన్డీటీవీ నివేదిక ప్రకారం, కాలుష్య నియంత్రణ బోర్డు నగరంలోని వివిధ ప్రదేశాలలో రియల్ టైం ధ్వని పర్యవేక్షణ స్టేషన్లను కలిగి ఉంది, నగరంలోని వివిధ ప్రాంతాల్లో శబ్ద కాలుష్యం అనుమతించాల్సిన దానికంటే ఎక్కువగా ఉన్నట్టు సూచిస్తోంది. ఇక సెంట్రల్ కాలుష్య నియంత్రణ బోర్డు ప్రకారం, 2017లో ధ్వని కాలుష్యంలో చెన్నైకి ఫస్ట్ ప్లేస్‌లో ఉంటే... తరువాత లక్నో, కోల్‌కతా, ముంబై ఉన్నాయి. కానీ, ఈ సారి మూడో స్థానంలో హైదరాబాద్‌లో నిలిచింది. ఈ విషయాన్ని ట్రాఫిక్ పోలీస్ డిపార్ట్‌మెంట్ సైతం అంగీకరిస్తోంది. నగరంలో పెచ్చుపెరిగిపోతున్న ధ్వని కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రచారాన్ని చేపట్టామంటున్నారు పోలీసులు. టెలికం కంపెనీలతో మాట్లాడి ధ్వని కాలుష్యాన్ని నివారించేలా మొబైల్ ఫోన్ వినియోగదారులకు సంక్షిప్త సందేశాలు పంపించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. బైక్ లకు సైలెన్సర్లను తొలగించి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. ధ్వని కాలుష్యంలో మూడో ర్యాంక్‌ పొందడం ఇదే మొదటిసారి అయినా... ఇది కలవరపెట్టే విషయమే అంటున్నారు అధికారులు, వైద్య నిపుణులు.