పడవ ప్రమాదం: శవాసనం వేసి ప్రాణాలు దక్కించుకున్న వ్యక్తి

పడవ ప్రమాదం: శవాసనం వేసి ప్రాణాలు దక్కించుకున్న వ్యక్తి

గోదావరి నదిలో జరిగిన బోటు ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన జానకి రామారావు శవాసనం వేసి ప్రాణాలతో బయటపడిన ఘటన చర్చనీయాంశంగా మారింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన అసలు ప్రమాదం ఎలా జరిగిందనేది ఆయన వివరించారు. అందరం టిఫిన్ చేసి బోటులో కూర్చున్నామని, కాసేపటికి పాపికొండలు వస్తాయని బోటు సిబ్బంది చెప్పారని ఆయన పేర్కోన్నారు. ఇది డేంజర్ జోన్ బోటు ఇటు, అటు కదిలినా భయపడద్దని వారు చెబుతున్న సమయంలోనే బోటు ఒక్కసారిగా పక్కకు ఒరిగిందని అన్నారు. ప్లాస్టిక్ కుర్చీల్లో కూర్చున్నవారంతా ఒక పక్కకు వచ్చేసారని, బరువంతా ఒకవైపునే ఉండడంతో బోటు మళ్లీ యథాస్థితికి రాలేకపోయిందని అన్నారు.

మరోవైపు, కింది అంతస్తులో ఉన్నవారంతా ఒకేసారి పై అంతస్తులోకి వచ్చేందుకు ప్రయత్నించారన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే తాను శవాసనం వేసి ప్రాణాలతో బయటపడినట్టు జానకి రామారావు వివరించారు. హైదరాబాద్ శివారులోని మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీనివాస కాలనీకి చెందిన జానకి రామారావు రిటైర్డ్ రైల్వే ఉద్యోగి. భార్య జ్యోతిక, బావమరిది భార్య, వారి కుమారుడుతో కలిసి ఆయన విహార యాత్రకు వచ్చారు. ప్రమాదంలో భార్య, బావమరిది భార్య, వారి కుమారుడు గల్లంతయ్యారు. ఆయన మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు.