ఏ స్థానంలో ఆడేందుకైనా సిద్ధం: పంత్‌

ఏ స్థానంలో ఆడేందుకైనా సిద్ధం: పంత్‌

ఆసీస్‌తో జరిగిన సిరీస్‌లో తేలిపోయిన టీమిండియా యువ వికెట్ కీపర్ రిషభ్‌ పంత్‌ ఐపీఎల్‌-12లో వీరవిహారం చేశాడు. ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్‌, ముంబై ఇండియన్స్‌ మధ్య ఐపీఎల్ మూడో మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో రిషభ్‌ పంత్‌ ఆకాశమే హద్దుగా చెలరేగి 27 బంతుల్లో 78 (7x4, 7x6) పరుగులు చేశాడు. దీంతో సొంత మైదానం వాంఖడే స్టేడియంలోని ముంబై అభిమానులు చిన్నబోయారు. మొదటగా బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ.. పంత్‌ చెలరేగడంతో 213 పరుగుల భారీ స్కోర్ చేసింది. లక్ష్య ఛేదనలో ముంబై 37 పరుగుల తేడాతో ఓడిపోయింది.

మ్యాచ్ అనంతరం రిషభ్‌ పంత్‌ మాట్లాడుతూ... ఇది ఒక గొప్ప ప్రయాణం. నా క్రికెట్ కెరీర్ లో ప్రతీరోజూ కొత్త మెళకువలు నేర్చుకోవడానికి ప్రయత్నిస్తా. పరుగులు చేసినపుడు జట్టు విజయం సాధిస్తే.. అది ఓ గొప్ప అనుభూతి. జట్టు అవసరాలను బట్టి ఏ స్థానంలో ఆడేందుకైనా సిద్ధంగా ఉన్నాను. పరిస్థితులను బట్టి బ్యాటింగ్‌ శైలిని మార్చుకుంటా. ఈసారి రన్‌రేట్‌ పెంచాలనుకుని భారీ షాట్స్ ఆడా.. దొరికిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నా. టీ20ల్లో ఏదైనా కొత్తగా చెయ్యాలి. ప్రత్యర్థి బౌలర్లు అవకాశం తీసుకునేలోపే.. మనమే అవకాశం తీసుకోవాలని పంత్‌ తెలిపారు.