కాంగ్రెస్‌తో దోస్తీకి రెడీ... కానీ, ఒక షరతు-కమల్

కాంగ్రెస్‌తో దోస్తీకి రెడీ... కానీ, ఒక షరతు-కమల్

2019లో పార్లమెంట్‌కు జరిగే ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేసేందుకు సిద్ధమని ప్రకటించారు విలక్షణ నటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత కమల్ హాసన్...  అయితే కాంగ్రెస్ పార్టీకి బంపర్ ఆఫర్ ఇచ్చినట్టే ఇచ్చి... ఓ షరతు పెట్టారాయన. 2019 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌తో దోస్తీకి సిద్ధమని స్పష్టం చేసిన ఆయన...  ఐతే దానికి కొన్ని కండిషన్లు ఉన్నాయని... డీఎంకేతో తెగదెంపులు చేసుకుంటేనే పొత్తు పెట్టుకుంటామని కీలకమైన మెలిక పెట్టేశారు. మరోవైపు కమల్ హాసన్... తొలిసారి డీఎంకే పార్టీపై విమర్శలు చేశారు. ఓ జాతీయ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ... "ఒకవేళ కాంగ్రెస్-డీఎంకే పొత్తు తెగిపోతే, 2019 ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలిసి పనిచేసేందుకు తాము సిద్ధం. మా కూటమి వలన తమిళనాడు ప్రజలకు మంచి జరుగుతుందని భావిస్తున్నానని వ్యాఖ్యానించారాయన.  కాంగ్రెస్‌పై సానుకూల వైఖరితో ఉన్న కమల్... గతంలో ఢిల్లీలో రాహుల్ గాంధీతో సమావేశమై తమిళనాడు రాజకీయ పరిస్థితుల గురించి చర్చించిన సంగతి తెలిసిందే. తాజాగా కమల్ చేసిన వ్యాఖ్యలు తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి.