ఎలాంటి పిచ్‌ మీదనైనా గెలిచే సత్తా ఉంది: చావ్లా

ఎలాంటి పిచ్‌ మీదనైనా గెలిచే సత్తా ఉంది: చావ్లా

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్) సీజన్‌ -12లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ తరఫున మంచి బౌలర్లు ఉన్నారు. ఎలాంటి పిచ్‌ మీదనైనా గెలిచే సత్తా కేకేఆర్‌కు ఉందని టీమిండియా మాజీ బౌలర్, కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ ఆటగాడు పీయూష్‌ చావ్లా ఆశాభావం వ్యక్తం చేసారు. ఐపీఎల్ కి ఇంకా మూడు రోజుల సమయం ఉన్న నేపథ్యంలో ఆయా జట్ల ఆటగాళ్లు అందరూ నెట్స్‌లో శ్రమిస్తున్నారు. కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ ఆటగాళ్లు కూడా ప్రాక్టీస్ సెషన్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పీయూష్‌ చావ్లా మాట్లాడారు.

ఈడెన్‌లో ఆడటం చాలా ఇష్టం, ఇక్కడ కేకేఆర్‌ జట్టుకు మంచి మద్దతు లభిస్తుందన్నారు. జట్టులో మంచి ఆటగాళ్లు ఉన్నారు.. ప్రస్తుతం జట్టంతా సమతూకంగా ఉంది. ఎలాంటి పిచ్‌ మీదనైనా గెలిచే సత్తా కేకేఆర్‌కు ఉందన్నారు. విదేశీ గడ్డపై కూడా చైనామన్‌ బౌలర్‌ కుల్‌దీప్‌ యాదవ్‌ అద్భుతంగా రాణించాడు. ఆసీస్ పర్యటనలో కూడా ఆకట్టుకున్నాడు. కుల్‌దీప్‌లో మంచి నైపుణ్యం దాగుంది, మరింత మెరుగ్గా రాణించేందుకు కష్టపడుతున్నాడని పీయూష్‌ చావ్లా పేర్కొన్నారు.

కుల్‌దీప్‌ బౌలింగ్‌పై నమ్మకం ఉంది, వచ్చే ప్రపంచకప్‌లో ప్రధాన బౌలర్‌గా రాణిస్తాడని ఆశాభావం వ్యక్తం చేసారు. ప్రపంచకప్‌లో కుల్‌దీప్‌, చాహల్‌లు వికెట్లు తీసి టీమిండియాకు విజయాలు అందిస్తారు. ఈ మధ్య కాలంలో కుల్‌దీప్‌ బాగా మెరుగయ్యాడు. ప్రపంచకప్‌లో మంచి బ్యాట్స్‌మెన్‌ ఎదురైతే.. పెద్ద సవాల్‌గా మారుతుంది. వారిని అడ్డుకునేందుకు అతనికి మంచి అవకాశం దొరుకుతుందని చావ్లా చెప్పుకొచ్చారు.

ఇక ఐపీఎల్‌, వన్డే ప్రపంచకప్‌ నేపథ్యంలో ఆటగాళ్లు ఫిట్‌నెస్‌ కోల్పోకుండా స్వయంగా తగిన జాగ్రత్త తీసుకోవాలని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సూచించిన విషయం తెలిసిందే. చావ్లా దీనిపై స్పందిస్తూ... అందరూ ప్రొఫెషనల్‌ క్రికెటర్లు. క్రికెట్ ఆట కారణంగా శరీరం ఎలా మార్పు చెందుతుందో తెలుసు. కాబట్టి ఎప్పుడు విశ్రాంతి తీసుకోవాలో తెలుసన్నారు.