దేశం విడిచే ముందు జైట్లీని కలిశా...మాల్యా

దేశం విడిచే ముందు జైట్లీని కలిశా...మాల్యా

భారత దేశం విడిచి వెళ్ళే ముందు తాను కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని కలిశానని వివాదాస్పద పారిశ్రామికవేత్త విజయ్ మాల్యా అన్నారు. వెస్ట్‌ మినిస్టర్ కోర్టులో కేసు వాయిదా హాజరయ్యేందుకు వచ్చిన ఆయన భారత మీడియాతో మాట్లాడారు.  బ్యాంకులతో తన బకాయిల వ్యవహారం  సెటిల్ చేసేందుకు తాను పలు మార్లు ప్రయత్నం చేశానని ఆయన పునరుద్ఘాటించారు. విజయ్ మాల్యా కేసులో ముగింపు వాదనలు  జరగాల్సిన ఉన్నా జడ్జి ఈ కేసు వినేందుకు నిస్సహాయత వ్యక్తం చేయడంతో కేసు వాయిదా పడింది.  'నన్ను రాజకీయ నాయకులు ఫుట్ బాల్ మాదిరిగా ఆడుకుంటున్నారు. ఈ విషయంలో నేను చేయగలిగింది ఏమీ లేదు. నా ఉద్దేశం సుస్పష్టం. నాకు సంబంధించిన రూ. 15000 కోట్ల విలువైన ఆస్తులను కర్ణాటక హైకోర్టు ఎదుట ఉంచాను. నన్ను బలిపశువును చేస్తున్నారు. రెండు రాజకీయ పార్టీలకు నేనంటే ఇష్టం లేద'ని మాల్యా కోర్టు వెలుపల అన్నారు. దేశం విడిచి వెల్ళిపొమ్మని ఎవరైనా సలహా ఇచ్చారా అన్న ప్రశ్నకు ఆయన సమాధానం ఇస్తూ... 'జెనీవాలో సమావేశం ఉన్నందున నేను అక్కడికి వెళ్ళాను. దేశం నుంచి బయలుదేరే ముందు ఆర్థిక మంత్రితో కలిశాను. బ్యాంకు బకాయిల వ్యవహారం సెటిల్‌ చేసేందుకు నా ఆఫర్ ను మళ్ళీ మళ్ళీ చెప్పాను. ఇది నిజమ'ని విజయ్‌ మాల్యా అన్నారు.