అందుకే కేజ్రీవాల్‌పై దాడి: బాబు

అందుకే కేజ్రీవాల్‌పై దాడి: బాబు

ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు, ఢిల్లీ సీఎం పై జరిగిన దాడిని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఖండించారు. ట్విటర్ వేదికగా స్పందిస్తూ.. 'ఓడించటం, అణిచివేయటం వంటి చర్యల నుంచి దాడులు చేసే స్థాయికి తెగబడ్డారు. వ్యవస్థలన్నీ నాశనం చేసిన శక్తులు ఇప్పుడు భౌతిక దాడులకు దిగుతున్నాయి. కేజ్రీవాల్ పై దాడి సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం. ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి పై దాడికి ఢిల్లీ పోలీసులు బాధ్యత వహించాలి. ఇలాంటి దాడులు ప్రజాస్వామ్యం బలోపేతం చేసే పోరాటాలకు మరింత బలపరుస్తాయి' అంటూ చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఢిల్లీలోని మోతీనగర్‌ రోడ్‌షోలో పాల్గొన్న కేజ్రీవాల్‌పై గుర్తు తెలియని వ్యక్తి దాడి చేసిన విషయం తెలిసిందే. కేజ్రీవాల్‌ ఉన్న ప్రచార రథంపైకి ఎక్కి పరుష పదజాలంతో దూషిస్తూ.. చెంపదెబ్బ కొట్టాడు. ఈ ఘటనతో అవాక్కయిన కేజ్రీవాల్‌ వాహనంలో వెనక్కి జరిగి దుండగుడి దాడి నుంచి తప్పించుకున్నారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది, ఆప్‌ కార్యకర్తలు దాడికి పాల్పడిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని దేహశుద్ది చేశారు.