తమిళనాడులో పలు చోట్ల ఐటీ దాడులు, రూ.15 కోట్ల నగదు స్వాధీనం

తమిళనాడులో పలు చోట్ల ఐటీ దాడులు, రూ.15 కోట్ల నగదు స్వాధీనం

తమిళనాడులో పలుచోట్ల ఆదాయపన్ను శాఖ శుక్రవారం దాడులు నిర్వహించింది. రాష్ట్రంలో ఎన్నికలు జరగనుండటంతో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు భారీగా నగదు తరలిస్తున్నారనే అనుమానంతో సోదాలు జరిపింది. రూ.15 కోట్ల నగదును స్వాధీనం చేసుకుంది. చెన్నై, నమక్కల్, తిరునల్వేలిలలో మొత్తం 18 ప్రాంతాల్లో శుక్రవారం తెల్లవారుజామున ఐటీ బృందాలు తనిఖీలు జరిపాయి.

లెక్క చూపని నగదును ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారనే ఆరోపణలపై పీఎస్కే ఇంజనీరింగ్ కన్ స్ట్రక్షన్ కంపెనీ అనే ఒక కాంట్రాక్టర్ సంస్థ ఆవరణలో ఐటీ అధికారులు సోదాలు జరిపారు. చెన్నైలో మూడు ప్రదేశాలు, నమక్కల్ లో కంపెనీకి చెందిన నాలుగు ఆవరణల్లో దాడులు జరిపినట్టు అధికారులు తెలిపారు. కన్ స్ట్రక్షన్ కంపెనీకి చెందిన నాలుగు చోట్ల నుంచి రూ.13.80 కోట్లతో సహా మొత్తం లెక్కచూపని నగదు రూ.14.54 కోట్లు స్వాధీనం చేసుకున్నట్టు సీనియర్ అధికారి చెప్పారు. ఖర్చులు ఎక్కువ చూపి సంపాదించిన లెక్కచూపని డబ్బు వివరాలు, ఖాతాలు, పలుకుబడి ఉన్న వ్యక్తులకు ఇచ్చిన చెల్లింపులు ఉన్న పత్రాలు, వ్యాపారాల్లోకి లెక్కచూపని పెట్టుబడిని అధికారులు జప్తు చేశారు. 

ఎన్నికల కోసం డబ్బు తరలిస్తున్నారనే ఆరోపణలకు సంబంధించిన పక్కా సమాచారంతో చెన్నై ఐటీ శాఖకు సంబంధించిన పరిశోధన విభాగం డబ్బు పంచుతున్న వ్యక్తులు, ఫైనాన్షియర్లపై దాడులు చేసింది. ఆకాష్ బాస్కరన్, సుజాయ్ రెడ్డీ అనే ఇద్దరు వ్యక్తుల ఇళ్లలో తనిఖీలు జరిపారు. సుజాయ్ రెడ్డి ఇంటి నుంచి రూ.18 లక్షలు జప్తు చేశారు. అతను ఒక మలేసియా కంపెనీలో రూ.16 కోట్ల మేర లెక్కచూపని నిధులు పెట్టుబడిగా పెట్టినట్టు పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. రెండు చోట్ల జరిపిన సోదాల్లో రూ.14.72 కోట్ల మొత్తం నగదును పట్టుకున్నారు. చెన్నైలో 10 చోట్ల, తిరునల్వేలిలో ఒక ప్రాంతంలో తనిఖీలు జరిపారు.