రూ.5 లక్షల కంటే ఎక్కువ నగదు తీసుకున్న రియల్టర్లకు ఐటీ నోటీసులు

రూ.5 లక్షల కంటే ఎక్కువ నగదు తీసుకున్న రియల్టర్లకు ఐటీ నోటీసులు

జూన్ 2015 డిసెంబర్ 2018 మధ్య తమ ఆస్తులు అమ్ముతూ రూ. 5 లక్షల కంటే ఎక్కువ నగదు తీసుకున్న దాదాపు 2,000 మందికి ఆదాయపన్ను శాఖ నోటీసులు పంపినట్టు ఒక సీనియర్ అధికారి శనివారం తెలిపారు. 'ఆస్తి కొనుగోళ్లలో రూ.5 లక్షలు అంత కంటే ఎక్కువ నగదు ఇచ్చిన కొనుగోలుదారులు, తీసుకున్న అమ్మకందారులకు మేం నోటీసులు పంపాం. ఈ కేసులు పూర్తయ్యాక రూ.5 లక్షల కంటే తక్కువ ఇచ్చిన, పుచ్చుకున్నవారిపై దృష్టి పెడతామని' ఏఎన్ఐ వార్తాసంస్థకు వివరించారు.

2015లో రియాల్టీ రంగం ద్వారా నల్లధనం సృష్టిని అడ్డుకొనేందుకు ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 269ఎస్ఎస్ ని ప్రవేశపెట్టడం జరిగింది. కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) ప్రకారం రియల్ ఎస్టేట్ రంగంలో వ్యవసాయ భూమి సహా ఏ లావాదేవీ అయినా  రూ.20,000 లేదా ఆ పైన ఉంటే అకౌంట్ పేయీ చెక్ లేదా రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ (ఆర్టీజీఎస్) లేదా ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ ఫర్ ద్వారా జరపాలి. ఆదాయపన్ను చట్టం సెక్షన్ 271డి కింద జూన్ 1, 2015 తర్వాత ఏ లావాదేవీ అయినా నగదు ద్వారా జరిపితే అమ్మకందారుపై అదే మొత్తానికి సరిసమానంగా జరిమానా విధిస్తారు. 

నగదు లావాదేవీలు జరిపిన ఆస్తుల అమ్మకందారులపై ఆదాయపన్ను శాఖ త్వరలోనే ఒక భారీ కార్యాచరణ చేపట్టనున్నట్టు జనవరి 18న ఏఎన్ఐ వార్తాసంస్థ తెలిపింది. దేశ రాజధానిలోని 21 సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలకు వెళ్లిన అధికారులు జూన్ 1, 2015 నుంచి డిసెంబర్ 2018 వరకు ఉన్న అన్ని ఆస్తి రిజిస్ట్రీలలోని రూ.20,000కి పైబడిన నగదు చెల్లింపులను స్కాన్ చేశారు. చట్టాన్ని ఉల్లంఘించినట్టు ఇదే పెద్ద సాక్ష్యం కానుంది.

అమ్మకందారులు, కొనుగోలుదారులు ఇద్దరికీ నోటీసులు పంపడం జరిగింది. 'కొనుగోలుదారులకు అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో ప్రశ్నించనున్నామని' అధికారి తెలిపారు.