ధోనీ నుంచి చాలా నేర్చుకున్నా: జాదవ్‌

ధోనీ నుంచి చాలా నేర్చుకున్నా: జాదవ్‌

ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా శనివారం ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో భారత్‌ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 236 పరుగులు చేసింది. ఛేదనలో 99 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన భారత్‌ను కేదార్‌ జాదవ్‌ 81 (87 బంతుల్లో; 9 ఫోర్లు, 1 సిక్స్‌), ఎంఎస్ ధోనీ 59 (72 బంతుల్లో; 6 ఫోర్లు, 1 సిక్స్‌)లు అజేయ అర్ధ సెంచరీలతో ఆదుకుని విజయాన్ని అందించారు. క్లిష్ట సమయంలో అద్భుతంగా ఆడిన కేదార్‌ జాదవ్‌కు 'మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' దక్కింది.

మ్యాచ్ అనంతరం కేదార్‌ జాదవ్‌ మాట్లాడుతూ... బౌలింగ్‌ చేసేటప్పుడు నేను బ్యాట్స్‌మన్‌ మైండ్ ను తెలుసుకుంటా. వికెట్‌కు సూటిగా బంతులేయడానికి ప్రయత్నిస్తా. బౌలింగ్‌ చేసేటప్పుడు నేను బౌలర్‌ అనే విషయం ఆలోచించను. దీంతో నాపై అదనపు బాధ్యత ఉండదు. నా బౌలింగ్‌ను ఆస్వాదిస్తా. ఇటీవల ఆస్ట్రేలియాలో కూడా ఈ తరహా లక్ష్యాన్ని ఛేదించాం. అవతలి ఎండ్‌లో మహి భాయ్‌ ఉంటే పెద్దగా ఆందోళన చెందాల్సిన పని లేదు. ధోనీ చెప్పినట్టు చేస్తే చాలు. ఈ రోజు కూడా అలానే చేశాను. ధోనీ నుంచి చాలా విషయాలు నేర్చుకున్నా. ఇంకా నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నా. ధోనీ, కోహ్లీలు ఛేజింగ్ లో బెస్ట్ అని భావిస్తున్నా. మైదానంలో తీవ్రతతో ఎలా ఆడాలో మా కెప్టెన్‌ను చూసి తెలుసుకుంటున్నా అని జాదవ్‌ చెప్పుకొచ్చాడు.