పార్టీ మార్పుపై కుండ బద్దలు కొట్టిన కోమటిరెడ్డి..!

పార్టీ మార్పుపై కుండ బద్దలు కొట్టిన కోమటిరెడ్డి..!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మునుగోడు స్థానం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి... అనంతరం పార్లమెంట్ ఎన్నికల్లో భువనగిరి ఎంపీ స్థానం నుంచి బరిలోకి దిగిన తన సోదరుడు, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విక్టరీలో కీలక పాత్ర పోషించారు. అనంతరం, ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన భార్యను పోటీకి దింపి ఓటమిపాలయ్యారు. అయితే, పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఆయన తీరులో మార్పు వచ్చింది. బీజేపీకి అనుకూలంగా ఆయన వ్యాఖ్యలు చేయడంతో సీరియస్ అయిన టి.కాంగ్రెస్ షోకాజ్ నోటీసులు కూడా జారీ చేసింది. ఇక, తొలిసారి పార్టీ మార్పు వ్యవహారంపై కుండ బద్ధలు కొట్టినట్టుగా చేప్పేశారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. పార్టీ మార్పుపై ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. తప్పు వాళ్లు చేసి.. షోకాజ్ నోటీసు నాకేంటి? అంటూ కాంగ్రెస్ నేతలపై ఫైర్ అయ్యారు. నన్ను నమ్ముకున్న ప్రజల కోసం బీజేపీలోకి వెళ్తున్నానని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీలో పీసీసీ చీఫ్ పదవి కోరుకున్న మాట వాస్తవమేనన్న కోమటిరెడ్డి... ప్రజల మద్దతుతో కాంగ్రెస్‌ను అధికారంలోకి తేవాలనుకున్నా.. కానీ, అనుకున్న ఫలితాలను సాధించలేకపోయాం అన్నారు. ఇప్పుడు నాకేం పదవులు వద్దు... ఇచ్చానా కాంగ్రెస్‌లో ఉండను అని ప్రకటించిన ఎమ్మెల్యే... వారంపదిరోజుల్లో అధికారికంగా బీజేపీలో చేరబోతున్నా.. నా మద్దతు దారులందరూ నా వెంటే ఉన్నారు.. రాబోయే రోజుల్లో బీజేపీదే అధికారం అంటూ ధీమా వ్యక్తం చేశారు. దీంతో, కోమటిరెడ్డి బీజేపీలో చేరతారు అంటూ కొద్దికాలంగా సాగుతోన్న ప్రచారానికి తెరపడింది. కోమటిరెడ్డి కమలం గూటికి చేరడం ఖాయమైపోయింది. 

నన్ను గెలిపించిన ప్రజలకు న్యాయం చేయాలన్నా, తెలంగాణలో టీఆర్ఎస్ ను ఎదుర్కోవాలన్నా అది బీజేపీతో సాధ్యం అన్నారు కోమటిరెడ్డి. గతంలో తాను చేసిన వ్యాఖ్యలను బీజేపీ నేతలు స్వాగతించారు. నన్ను బీజేపీలోకి ఆహ్వానించారన్న ఆయన.. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాబోతుందన్నారు. మాలాంటివాళ్లు బీజేపీలో చేరితే.. కాంగ్రెస్ ఖాళీ అవుతుందని.. వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు రాజగోపాల్ రెడ్డి. తాను ప్రజల కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం ఆలోచించే వ్యక్తిని తప్ప.. పార్టీ కోసం ఆలోచించనని... పార్టీ షోకాజ్ నోటీసులకు సమాధానం ఇచ్చే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు.