ముగిసిన వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ డీబ్రీఫింగ్

ముగిసిన వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ డీబ్రీఫింగ్

పాకిస్థాన్ ఎఫ్-16 ఫైటర్ జెట్ ను తన మిగ్ యుద్ధ విమానంతో కూల్చేసిన భారతీయ వాయుసేన పైలెట్ వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ డీబ్రీఫింగ్ (ప్రశ్నోత్తరాలు) పూర్తయింది. వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ తో భారతీయ వాయుసేన, ఇతర ఏజెన్సీలు ప్రశ్నించడం పూర్తయినట్టు ఐఏఎఫ్ వర్గాలు తెలిపాయి. ఇక సైన్యానికి అనుబంధ, రెఫరెల్ ఆస్పత్రి డాక్టర్ల సలహా మేరకు ఆయనకు సిక్ లీవ్ ఇవ్వడం జరిగింది. 

సమీప భవిష్యత్తులో మెడికల్ రివ్యూ బోర్డ్ వింగ్ కమాండర్ మెడికల్ ఫిట్ నెస్ ను అంచనా వేస్తుంది. ఆయన తిరిగి పూర్తి స్థాయి ఫైటర్ పైలట్ బాధ్యతలు ప్రారంభించవచ్చా? లేదా? అనేది నిర్ణయిస్తుంది.

ఐఏఎఫ్ కి చెందిన వింగ్ కమాండర్ అభినందన్ మార్చి 1న పాకిస్థాన్ నుంచి భారత గడ్డపై కాలుపెట్టారు. భారత్, పాకిస్థాన్ వాయుసేనలకు చెందిన యుద్ధ విమానాల మధ్య జరిగిన ఘర్షణ సమయంలో మిగ్ 21 కూలిపోవడంతో అభినందన్ పాకిస్థాన్ అధీనంలోని కశ్మీర్ (పీఓకే)లో దిగారు. ఆ తర్వాత పాక్ సైన్యం ఆయనను తమ అధీనంలోకి తీసుకుంది. భారత్ ఒత్తిడికి తలొగ్గి పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్, పాక్ పార్లమెంట్ ప్రత్యేక సమావేశంలో భారత పైలెట్ ను విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.

మార్చి 1 రాత్రి సుమారు 9.20 గంటలకు వింగ్ కమాండర్ అభినందన్ వాఘా బోర్డర్ నుంచి భారత గడ్డపైకి ప్రవేశించారు. ఆయనను ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తరలించారు. ఢిల్లీలో రక్షణ మంత్రి, ఎన్ఎస్ఏ అజిత్ ధోవల్ తో పాటు అనేక మంది అధికారులు కలుసుకున్నారు. ఎయిర్ ఫోర్స్ సెంట్రల్ మెడికల్ ఎస్టాబ్లిష్ మెంట్ (ఏఎఫ్ సీఎంఈ) అభినందన్ కు వైద్య పరీక్షలు జరిపింది. మెడికల్ పరీక్షల తర్వాత ఆయనను వాయుసేన హాస్పిటల్ కు మార్చారు.