పాక్ ఎఫ్-16 కూల్చివేతపై రాడార్ చిత్రం విడుదల చేసిన ఐఏఎఫ్

పాక్ ఎఫ్-16 కూల్చివేతపై రాడార్ చిత్రం విడుదల చేసిన ఐఏఎఫ్

పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్ కి చెందిన ఎఫ్-16లు భారత గగనతలంలోకి చొరబడినపుడు ఒక ఫైటర్ జెట్ ను కూల్చేశామనేందుకు భారతీయ వాయుసేన మరో రుజువు చూపించింది. వాయుసేనకు చెందిన ఎయిర్ బార్న్ అండ్ కంట్రోల్ సిస్టమ్ (అవాక్స్) రాడార్ తో తీసిన చిత్రాలను జారీ చేసింది. ఇందులో పాక్ కు చెందిన రెండు ఎఫ్-16లు, ఒక జెఎఫ్-17 కనిపిస్తున్నాయి.

ఇవాళ విడుదల చేసిన ప్రకటనలో ఐఏఎఫ్ ' ఫిబ్రవరి 27న పీఏఎఫ్ ఎఫ్-16లను ఉపయోగించిందనేందుకు మా దగ్గర గట్టి సాక్ష్యాధారాలు ఉన్నాయి. మా మిగ్-21 బైసన్ ఎఫ్-16ను కూల్చేసిందనడం నిజమే. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. ఫిబ్రవరి 27న ఆకాశంలో జరిగిన ఎన్ కౌంటర్ లో రెండు ఎయిర్ క్రాఫ్ట్ లు కూలిపోయాయి. ఒకటి మా బైసన్ కాగా రెండోది పాక్ కి చెందిన ఎఫ్-16. ఎలక్ట్రానిక్ సిగ్నేచర్, రేడియో ట్రాన్స్ క్రిప్ట్ ద్వారా ఇది రుజువైంది' అని పేర్కొంది.

ఎయిర్ వైస్ మార్షల్ ఆర్జీకే కపూర్ మాట్లాడుతూ 'పాకిస్థాన్ చొరబడినపుడు ఒక ఎఫ్-16 కోల్పోయిందనేందుకు మా దగ్గర విశ్వసనీయమైన రుజువులు ఉన్నాయి. కానీ భద్రత, గోపనీయత కారణంగా మేం దానిని బహిర్గతం చేయడం లేదు. పాకిస్థాన్ ఇంటర్ సర్వీస్ పబ్లిక్ రిలేషన్ (డీజీ-ఐఎస్పీఆర్) జారీ చేసిన కొన్ని ప్రకటనలు కూడా మా వాదనను బలపరుస్తున్నాయని' చెప్పారు.

డీజీ-ఐఎస్పీఆర్ తన ప్రారంభ ప్రకటనలో ముగ్గురు పైలెట్లు అన్నారని.. ఇందులో ఒకరిని అదుపులోకి తీసుకొనడం జరిగిందని, మరో ఇద్దరు ఇంకా బయటే ఉన్నారని చెప్పినట్టు కపూర్ గుర్తు చేశారు. ఆ తర్వాత డీజీ-ఐఎస్పీఆర్ తమ దగ్గర ఇద్దరు పైలెట్లు ఉన్నట్టు ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెబుతూ ఒకరు కస్టడీలో మరొకరు ఆస్పత్రిలో చేరినట్టు వివరించారని కపూర్ అన్నారు. దీనిని పాకిస్థాన్ ప్రధానమంత్రి కూడా ధ్రువీకరించారు. దీంతో ఆ రోజు 2 ఎయిర్ క్రాఫ్టులు కూలినట్టు స్పష్టమవుతోందని కపూర్ తెలిపారు.

ఫిబ్రవరి 27న భారత్ పై దాడి చేసిన సమయంలో ఐఏఎఫ్ పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్ రేడియో సిగ్నల్ ను ఇంటర్సెప్ట్ చేయడం జరిగిందని వాయుసేన వర్గాలు చెప్పాయి. వింగ్ కమాండర్ అభినందన్ ఎఫ్-16ను పాకిస్థాన్ సరిహద్దుల్లో 7-8 కిలోమీటర్ల పరిధిలో కూల్చినట్టు తెలిపాయి. ఇందులో పాకిస్థానీ ఎయిర్ ఫోర్స్ రేడియో సంభాషణతో వాళ్ల ఎఫ్-16 బేస్ కి తిరిగి రాకపోవడం స్పష్టంగా తెలియజేస్తోందని వివరించింది.