'సూపర్‌ ఓవర్' వివాదానికి చెక్.. ఐసీసీ కీలక మార్పులు

'సూపర్‌ ఓవర్' వివాదానికి చెక్.. ఐసీసీ కీలక మార్పులు

ప్రపంచకప్‌ సెమీస్‌, ఫైనల్లో ఫలితం వచ్చేవరకూ సూపర్‌ ఓవర్‌ను కొనసాగిస్తామని అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసీసీ) వెల్లడించింది. సోమవారం జరిగిన సమావేశంలో ఐసీసీ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. సూపర్‌ ఓవర్ అంశంలో పలు కీలక మార్పులు చేసింది ఐసీసీ. ఇక నుంచి ప్రపంచకప్‌ సెమీస్‌, పైనల్లో సూపర్‌ఓవర్‌ టైగా మారితే బౌండరీ లెక్కతో విజేతను నిర్ణయించబోమని తెలిపింది. స్పష్టమైన విజేత తేలేవరకు సూపర్‌ ఓవర్లు ఆడిస్తామని స్పష్టం చేసింది. ఇప్పటివరకూ సూపర్‌ఓవర్‌ టైగా మారితే బౌండరీల లెక్కను బట్టి విజేతను నిర్ణయించేవారు. ఇటీవల ఇంగ్లాండ్‌, న్యూజిలాండ్‌ మధ్య జరిగిన ప్రపంచకప్‌ ఫైనల్‌ పెద్ద దుమారం రేపింది. మ్యాచ్‌టైగా మారడంతో ఇరుజట్లను సూపర్‌ ఓవర్‌ ఆడించారు. కానీ, సూపర్‌ఓవర్‌లో కూడా ఇరు జట్ల స్కోరు సమం కావడంతో అధిక బౌండరీలు బాదిన ఇంగ్లాండ్‌ను విశ్వవిజేతగా నిర్ణయించారు ఎంపైర్లు. దీంతో ఐసీసీ నిబంధనలపై మాజీ క్రికెటర్లు, అభిమానులు నుండి పెద్దఎత్తున విమర్శలు వచ్చాయి. దీంతో  సూపర్‌ఓవర్ నిబంధనలపై అనిల్‌కుంబ్లే నేతృత్వంలో కమిటీని నియమించింది. సుదీర్ఘ విశ్లేషణ తరువాత కుంబ్లే కమిటీ సిఫార్సుల మేరకు ఈ నిర్ణయాన్ని తీసుకుంది ఐసీసీ.