జయసూర్యపై అవినీతి మరక

జయసూర్యపై అవినీతి మరక

శ్రీలంక బ్యాటింగ్ గ్రేట్ సనత్ జయసూర్యపై అవినీతి మరక పడింది. జయసూర్య అవినీతి నిరోధక కోడ్ ఉల్లంఘించాడని ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఆరోపించింది. లంక మాజీ డాషింగ్ ఓపెనర్ రెండు సందర్భాలలో తన కోడ్ గీత దాటాడని ప్రపంచ క్రికెట్ ను శాసించే ఐసీసీ సోమవారం తెలిపింది. ఐసీసీ ఏర్పాటు చేసిన అవినీతి నిరోధక యూనిట్ (ఏసీయు)కి దర్యాప్తులో సహకరించేందుకు శ్రీలంక మాజీ కెప్టెన్, విధ్వంసకర ఓపెనర్ నిరాకరించినట్టు ఐసీసీ పేర్కొంది. అవినీతి నిరోధక దర్యాప్తులో కీలకమైన సాక్ష్యాధారాలను దాచేందుకు, ధ్వంసం చేసేందుకు, చెడ గొట్టేందుకు జయసూర్య ప్రయత్నిస్తున్నాడని తెలిపింది. దీనిపై జవాబు ఇచ్చేందుకు జయసూర్యకు ఇవాళ్టి నుంచి 14 రోజుల సమయం ఇస్తున్నట్టు చెప్పింది. 

జయసూర్య మొత్తం 110 టెస్టులు ఆడి 14 సెంచరీలతో మొత్తం 6,973 పరుగులు చేశాడు. 2007లో ఆట నుంచి వైదొలగుతున్నట్టు ప్రకటించాడు. పరిమిత ఓవర్ల క్రికెట్ లో జయసూర్య తనదైన ముద్ర వేశాడు. ముఖ్యంగా లంక వికెట్ కీపర్-బ్యాట్స్ మెన్ రొమేష్ కలువితరణతో కలిసి మెరుపు ఓపెనింగ్ ఇచ్చేవాడు. 1996లో శ్రీలంక 50 ఓవర్ల వరల్డ్ కప్ టైటిల్ గెలిచిన లంక జట్టులో జయసూర్య కీలక సభ్యుడు. అతని కెరీర్ చివరి దశలో ఉండగా ప్రవేశించిన ట్వంటీ20లు ఆడుతూ 2012లో ఆట నుంచి తప్పుకొని రాజకీయాల్లో ఆరంగేట్రం చేశాడు. ఈ నెల మొదట్లో శ్రీలంక క్రికెట్ లో జరిగిన అవినీతి ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్న ఏసీయు దీనికి సంబంధించిన వివరాలను లంక అధ్యక్షుడు, ప్రధానమంత్రి, క్రీడల మంత్రికి వివరించింది.