నాకౌట్లో భారత్, పాక్ ఎదురైతే: పీసీబీ
వన్డే ప్రపంచకప్‌లో భాగంగా నాకౌట్ దశలో భారత్-పాక్ మధ్య మ్యాచ్ ఎదురైతే బీసీసీఐ ఏం చేస్తుందని పీసీబీ ప్రశ్నించబోతోంది. పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో వన్డే ప్రపంచకప్‌లో భారత్-పాక్ మ్యాచ్ పై వివాదం నెలకొంది. తాజాగా భారత వైమానిక దళ విమానాలు ఉగ్రవాద స్థావరాలపై సర్జికల్ దాడులు చేశాయి. దీంతో ఇరు దేశాల మధ్య మరింత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో భారత్-పాక్ మధ్య క్రికెట్ సంబంధాలు కూడా మరింతగా దెబ్బతిన్నాయి.
వన్డే ప్రపంచకప్‌లో భాగంగా జూన్ 16న పాక్‌తో జరిగే మ్యాచ్‌ని బాయ్‌కాట్ చేయాలని మాజీ క్రికెటర్లు తెలిపారు. మరోవైపు టెర్రరిజాన్ని పెంచిపోషిస్తున్న దేశాలను వరల్డ్‌కప్ నుంచి బహిష్కరించాలని ఐసీసీకి బీసీసీఐ లేఖ రాసింది. ఈ నేపథ్యంలో దుబాయ్‌లో శుక్రవారం లేదా శనివారం జరుగనున్న ఐసీసీ ఎగ్జిక్యూటివ్ బోర్డ్ త్రైమాసిక సమావేశంలో భారత్-పాక్ మ్యాచ్ చర్చకు రానుంది. మ్యాచ్ విషయమై బీసీసీఐ, పీసీబీ అధికారులతో ప్రత్యేకంగా చర్చించనున్నట్లు ఐసీసీ అధికారులు తెలిపారు.
ఈ ప్రత్యేక సమావేశంలో లీగ్ దశలో పాక్ తో మ్యాచ్ ఆడకూడదని భావిస్తున్న భారత్ పై చర్యలు తీసుకోవాలని పీసీబీ డిమాండ్ చేయనుంది. భారత్ లీగ్ దశలో మ్యాచ్ ఆడనంటుంది, కానీ నాకౌట్ దశలో ఇరు జట్లు ఎదురుపడితే అప్పుడేం చేస్తారనే ప్రశ్నను ఐసీసీ ముందు పీసీబీ ఉంచనుంది. జాతి విద్వేష వ్యాఖ్యలు చేశాడంటూ కెప్టెన్ సర్పరాజ్‌ఖాన్‌పై నిషేదం విధించిన ఐసీసీ.. తమతో మ్యాచ్ ఆడనంటున్న భారత్ పట్ల కూడా అలాంటి చర్యలే తీసుకోవాలని పీసీబీ కోరనుంది.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)