ఐసీసీకి మాస్టర్ స్ట్రోక్ ఇచ్చిన సచిన్!!

ఐసీసీకి మాస్టర్ స్ట్రోక్ ఇచ్చిన సచిన్!!

టీమిండియా మాజీ దిగ్గజ ఆటగాడు, క్రికెట్ దేవుడిగా పేరొందిన సచిన్ టెండూల్కర్ ఇప్పటికీ ప్రతి అభిమాని గుండెల్లో అలాగే ఉన్నాడు. ఇంటర్నేషనల్ క్రికెట్ లో సచిన్ పేరిట 200కి పైగా వికెట్లు తీసుకున్న రికార్డు ఉండొచ్చు కానీ టెండూల్కర్ తన బ్యాటింగ్ ప్రతిభతోనే ఎవరెస్ట్ స్థాయికి చేరాడు. వన్డే, టెస్ట్ ఫార్మాట్లలో అత్యధిక పరుగులు, అత్యధిక సెంచరీలు, అత్యధిక అర్థశతకాలు, అత్యధిక మ్యాచ్ లు ఆడిన రికార్డులన్నీ సచిన్ కే సొంతం. అలాంటి మాస్టర్ బ్లాస్టర్ ని ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ట్రోల్ చేయబోయింది. 

తన చిన్ననాటి స్నేహితుడు వినోద్ కాంబ్లీతో ఉన్న వీడియో ఒకటి సచిన్ పోస్ట్ చేశాడు. నవీ ముంబైలో టెండూల్కర్-మిడిల్ సెక్స్ గ్లోబల్ అకాడమీ క్యాంప్ లో తీసిన ఈ వీడియోలో సచిన్ తన ట్రేడ్ మార్క్ లెగ్ స్పిన్ వేస్తున్నాడు. బౌల్ చేస్తున్నపుడు టెండూల్కర్ కాలు క్రీజ్ కి చాలా బయట ఉంది. దీనిపై ఐసీసీ తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ లో ట్రోల్ చేసేందుకు ప్రయత్నించింది. మాస్టర్ బ్లాస్టర్ కూడా దీనికి గట్టిగానే చురకలేశాడు.

సచిన్ వీడియోను రీట్వీట్ చేస్తూ ఐసీసీ 'సచిన్ టెండూల్కర్ మీరు మీ ముందు కాలు ఎక్కడుందో చూడండి' అని రాసింది. దీనితో పాటు సుప్రసిద్ధ అంపైర్ స్టీవ్ బక్నర్ నో బాల్ అని సూచిస్తున్న ఫోటోని జత చేసింది. అలాగే తన ట్వీట్ తో ఐసీసీ ఫన్నీ ఎమోజీ కూడా పెట్టింది. అంటే సరదాగా చేసిన వ్యాఖ్య అని స్పష్టంగా తెలుస్తోంది. 

స్టీవ్ బక్నర్ కీలక వివాదాస్పద నిర్ణయాలకు ఎన్నోసార్లు బలైన సచిన్ కూడా దీనికి అంతే ధీటుగా జవాబు ఇచ్చాడు. 'ఇప్పుడు కనీసం బౌలింగ్ చేస్తున్నాను. బ్యాటింగ్ కాదని' రాశాడు. అంపైర్ నిర్ణయం ఎప్పుడూ తుది నిర్ణయం అవుతుందని పేర్కొన్నాడు.