అండర్ 19 వరల్డ్ కప్.. హై ఓల్టేజ్ మ్యాచ్‌ నేడే..

అండర్ 19 వరల్డ్ కప్.. హై ఓల్టేజ్ మ్యాచ్‌ నేడే..

దక్షిణాఫ్రికాలో జరుగుతున్న అండర్‌-19 ప్రపంచకప్‌ తుది సమరానికి సిద్ధమైంది. అన్ని జట్లను మట్టికరిపించి.. భారత్‌, బంగ్లాదేశ్‌ జట్లు ఫైనల్‌కు చేరాయి. ఏమాత్రం అంచనాల్లేని బంగ్లాదేశ్‌ ఈ టోర్నీలో అత్యుత్తమ ప్రదర్శన చేసి తొలిసారి ఫైనల్‌కు చేరింది. మరోవైపు అండర్‌-19లో ఇప్పటికే నాలుగుసార్లు విశ్వవిజేతగా నిలిచిన యువ భారత్‌ ఐదోసారి తన ఆధిపత్యాన్ని ప్రదర్శించాలని చూస్తోంది. ఈ మెగాటోర్నిలో ఓటమెరుగని జట్లుగా టీమిండియా, బంగ్లా టీమ్స్‌ జోరుమీదున్నాయ్‌. ఫైనల్‌లో టీమిండియానే హాట్‌ ఫేవరెట్‌..! కానీ, అంచనాలకు అందని బంగ్లా ఏమైనా చేయగలదు. రెండు జట్లు అన్ని రంగాల్లో పటిష్టంగా ఉన్నాయి. ఈ మెగాటోర్నిలో ఘన చరిత్ర ఉన్న డిఫెండింగ్‌ చాంపియన్‌ భారత్‌ 6 సార్లు  ఫైనల్‌కు చేరి 4 సార్లు విజేతగా నిలిచింది. ఇది ఏడోసారి. దీంతో ఈ మ్యాచ్‌ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

యశస్వీ జైస్వాల్, దివ్యాన్ష్ సక్సెనా, తిలక్ వర్మ, ప్రియామ్ గార్గ్, దృవ్ జురెల్‌లో భారత బ్యాటింగ్ బలంగా ఉంది. పేసర్లు కార్తీక్ త్యాగి, ఆకాష్ సింగ్ అద్భుత ఫామ్‌లో ఉండగా. స్పిన్నర్లు రవి బిష్ణోయ్, అథర్వ అంకోలేకర్‌తో బౌలింగ్ విభాగం పటిష్టంగా ఉంది. బ్యాటింగ్‌లో టాపార్డర్ విఫలమైనా.. తక్కువ స్కోర్‌కు పరిమితమైనా.. కాపాడుకునే బలం భారత్ బౌలర్ల సొంతం. ఇప్పటివరకు 12సార్లు వరల్డ్‌కప్‌ జరిగితే నాలుగుసార్లు విజేతగా నిలిచిన భారత్‌.. అత్యధికసార్లు ట్రోఫీ గెలిచిన జట్టుగా రికార్డు సృష్టించింది. రెండేళ్ల కిందట న్యూజిలాండ్‌లో టైటిల్‌ నెగ్గిన భారత్‌.. ఈ సారి కూడా కప్పు ఎగరేసుకుపోయిందని భావిస్తున్నారు మాజీలు. దీంతో ఈ మ్యాచ్‌ కోసం క్రికెట్‌ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.