మహిళల టి-20 వరల్డ్‌కప్‌లో భారత్ రెండో విజయం

మహిళల టి-20 వరల్డ్‌కప్‌లో భారత్ రెండో విజయం

మహిళల టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా మరో విజయం సొంతం చేసుకుంది. బంగ్లాదేశ్‌పై 18 పరుగులతో గెలించింది భారత మహిళల జట్టు. మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన హర్మన్‌ప్రీత్ కౌర్ సేన నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. భారత బ్యాట్స్‌వుమెన్‌లలో షెఫాలీ వర్మ 39 పరుగులతో అదరగొట్టగా, జెమీమీ రోడ్రిగ్స్ 34, వేదా కృష్ణమూర్తి 20 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. తర్వాత.. 143 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన బంగ్లాదేశ్ 8 వికెట్ల నష్టానికి 124 పరుగులు మాత్రమే చేసి 18 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. భారత బౌలర్లలో పూనమ్ యాదవ్ మూడు వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది. అరుంధతి రెడ్డి, శిఖ పాండే చెరో రెండు వికెట్లు పడగొట్టగా రాజేశ్వరి గైక్వాడ్ ఓ వికెట్ తీసింది. 17 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 39 పరుగులు చేసిన షెఫాలీ వర్మకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.