నేడు పాకిస్తాన్‌తో భారత్ పోరు

నేడు పాకిస్తాన్‌తో భారత్ పోరు

మహిళల టీ-20 ప్రపంచకప్‌లో నేడు పాకిస్తాన్‌తో భారత్ ఢీకొననుంది. మొదటి మ్యాచ్ లో దూకుడైన ఆటతో కివీస్‌ను హడలెత్తించిన భారత మహిళలు ప్రపంచ కప్‌లో మంచి ఆరంభంను ఇచ్చారు. ఆదివారం రెండో లీగ్‌ మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ లో టీమిండియానే ఫేవరేట్ గా బరిలోకి దిగుతుంది. అయితే పాక్‌ను తక్కువ అంచనా వేయొద్దు. 2016 ప్రపంచ కప్‌లో సొంతగడ్డపై భారత్‌ను ఓడించిన ఘనత పాక్ ది. అంతర్జాతీయ టీ-20ల్లో ఇప్పటి వరకు భారత్, పాకిస్తాన్‌ జట్లు 10 మ్యాచ్‌ల్లో తలపడగా.. 8 మ్యాచ్‌ల్లో భారత్‌ గెలుపొందగా, 2 మ్యాచ్‌ల్లో పాకిస్తాన్‌ విజయం సాధించింది. అయితే హర్మన్‌ప్రీత్‌ సారథ్యంలో పాక్‌తో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ భారత్ గెలిచింది. రాత్రి  8.30 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది. పాక్‌ను కూడా ఓడిస్తే భారత్‌కు సెమీస్‌ అవకాశాలు మెరుగవుతాయి.

పేస్ సమస్య:

కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్, మిథాలీ రాజ్, స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్, వేద కృష్ణమూర్తిలతో భారత బ్యాటింగ్‌ లైనప్‌ పటిష్టంగా ఉంది. ఇందులో ఏ ఇద్దరు ఆడినా భారత్ కు తిరుగుండదు. మొదటి మ్యాచ్ లో స్టార్ ప్లేయర్ మిథాలీకి బ్యాటింగ్ అవకాశమే రాలేదు. దీన్ని బట్టే అర్ధం అవుతుంది టాప్ ఆర్డర్ ఏవిధంగా బ్యాటింగ్ చేస్తుందో. దూకుడుగా ఆడుతున్న హర్మన్‌, జెమీమాలకు తోడు మిథాలీ కూడా చెలరేగితే భారీ స్కోర్ సాధించవచ్చు. ఇక బౌలింగ్ లో హేమలత దయాలన్, రాధా యాదవ్, పూనమ్‌ యాదవ్, దీప్తి శర్మలతో స్పిన్‌ పటిష్టంగానే ఉంది. ఇక పేస్‌లో కొంత బలహీనంగా ఉంది. ఇది ఒక్కటే భారత్ కు సమస్య. తొలి మ్యాచ్‌ ఆడిన అరుంధతిరెడ్డి అంతగా ఆకట్టుకోలేదు. అయితే ఈ మ్యాచ్ లో మాన్సి జోషి, పూజ వస్త్రకర్‌ ఒకరిని తీసుకునే అవకాశాలు ఉన్నాయి.

బలహీనంగా పాక్:

ఈ మధ్య కాలంలో పాక్ ఆట ఏమంత చెప్పుకోదగ్గ రీతిలో లేదు. పాక్‌ బ్యాటింగ్‌ మొత్తంను కెప్టెన్‌ జవేరియా ఖాన్‌నే మోస్తుంది. అయితే ఆసీస్ మ్యాచ్ లో ఖాన్‌ తక్కువ పరుగులకే పెవిలియన్ చేరింది. ఖాన్‌కు తోడు ఆల్‌రౌండర్‌ బిస్మా మరూఫ్‌, స్పిన్నర్‌ సనా మిర్ లు ఉన్నారు. ఆసీస్ తో జరిగిన మ్యాచ్ లో సోహైల్ కూడా ఆకట్టుకుంది. అయితే స్థిరమైన ప్రదర్శన కనబర్చేవారు లేకపోవడంతో పాక్ ఇబ్బందులను ఎదుర్కొంటుంది. బౌలింగ్ లో కూడా పాక్ బలహీనంగానే ఉంది. మిర్, మరూఫ్‌, అమిన్ లనే నమ్ముకుంది.