శిఖర్ ధవన్ కి సచిన్ ఓదార్పు

శిఖర్ ధవన్ కి సచిన్ ఓదార్పు

ఎడమ చేతి బొటనవేలికి గాయం కారణంగా ప్రపంచ కప్ నుంచి వైదొలగిన భారత జట్టు ఓపెనింగ్ బ్యాట్స్ మెన్ శిఖర్ ధవన్ కి అన్ని వైపుల నుంచి ధైర్యం చెబుతూ సందేశాలు వెల్లువెత్తుతున్నాయి. భారత దిగ్గజ బ్యాట్స్ మెన్, క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ కూడా తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ లో ధవన్ కి సందేశం పోస్ట్ చేశారు. అందులో సచిన్ 'నీకు నా పూర్తి సానుభూతి శిఖర్! నువ్వు చాలా బాగా ఆడుతున్నావు. ఇలాంటి ఎంతో కీలక టోర్నమెంట్ మధ్యలో నువ్వు గాయపడటంతో బాధకి హృదయం బరువెక్కింది. నువ్వు మళ్లీ ఇంకా బలంగా తిరిగి వస్తావని నాకు నమ్మకం ఉంది' అని రాశాడు. అలాగే రిషభ్ పంత్ కి శుభాకాంక్షలు తెలుపుతూ 'రిషభ్ నువ్వో మంచి ఆటగాడివి. బాగా ఆడతావు, ఇది నీకు నిన్ను నీవు నిరూపించుకునేందుకు మంచి వేదిక. నీకు శుభాకాంక్షలు' అని పేర్కొన్నాడు.

ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో ధవన్ ఎడమ చేతి బొటనవేలికి గాయమైంది. దీంతో అతనిని పరీక్షించిన బీసీసీఐ వైద్య బృందం సుమారు 3 వారాల పాటు క్రికెట్ ఆడరాదని సూచించింది. కానీ ఇప్పుడు ధవన్ ప్రపంచ కప్ మొత్తం నుంచే వైదొలగాల్సి వచ్చింది. గాయం కారణంగా ధవన్ న్యూజిలాండ్, పాకిస్థాన్ లతో మ్యాచ్ లు ఆడలేదు. ధవన్ స్థానంలో ఇప్పుడు బ్యాకప్ ఆటగాడిగా ఉన్న జట్టులోకి రిషభ్ పంత్ ని ఇంగ్లాండ్ పిలిపించి చేర్చుకున్నారు. 

మొదట ధవన్ పరిస్థితిని పరిశీలిస్తున్నామని టీమ్ మేనేజ్ మెంట్ చెప్పింది. కొన్ని రోజుల్లో కోలుకుంటాడని చివరి లీగ్ మ్యాచ్, సెమీఫైనల్ ఆడవచ్చని తెలిపింది. టైటిల్ ఫేవరెట్ గా ఉన్న టీమిండియాకు ధవన్ ప్రపంచ కప్ నుంచి వైదొలగడం పెద్ద దెబ్బే. ప్రస్తుతం ధవన్ అద్భుత ఫామ్ లో ఉన్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో ధవన్ సూపర్ సెంచరీ చేశాడు. దాంతో భారత జట్టు 50 ఓవర్లలో 352 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆ మ్యాచ్ లో భారత్ 36 పరుగుల తేడాతో గెలిచింది.