దీపక్‌ కొచ్చార్‌..మరో రూ. 422 కోట్ల స్కామ్‌?

దీపక్‌ కొచ్చార్‌..మరో రూ. 422 కోట్ల స్కామ్‌?

వీడియోకాన్‌ రుణ వివాదం నుంచి ఇంకా తేరుకోకుండానే ఐసీఐసీఐ బ్యాంక్‌  మేనేజింగ్‌ డైరెక్టర్‌ , చీఫ్‌ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌ (సీఈఓ) చందా కొచ్చర్ మరో భారీ కుంభకోణంలో ఇరుక్కున్నట్లు కన్పిస్తోంది.  ఈసారి ఈమె ఫ్యామిలీ అత్యంత వివాదాస్పద పారిశ్రామిక గ్రూప్‌ ఎస్సార్‌  నుంచి భారీగా లబ్ది పొందినట్లు ఆర్థిక అక్రమాలను వెలికితీసే కార్యకర్త అరవింద్‌ గుప్తా  ఆరోపించారు. రెండు కంపెనీల ద్వారా సుమారు రూ. 422 కోట్లు చందా కొచ్చర్‌ భ్త దీపక్‌ కొచ్చర్‌కు చెందిన నూ పవర్‌ గ్రూప్‌నకు మళ్ళినట్లు ఆయన ఆరోపించారు. మే 11న ఆయన తాజా ఆరోపణలకు సంబంధించిన పత్రాలను ప్రధాని నరేంద్ర మోడీకి పంపారు. విచిత్రమేమిటంటే... వీడియోకాన్‌కు సంబంధించిన కుంభకోణం తాలూకు అంశాలను కూడా ఇతనే రెండేళ్ళ క్రితం అంటే 2016  మార్చిలో బయటపెట్టారు. మారిషస్‌ కంపెనీల ద్వారా  సాగిన ఈ కుంభకోణంలో ఎస్సార్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ శశిరుయా బంధువులు కీలకపాత్ర పోషించినట్టు అరవింద్ గుప్తా తెలిపారు.


జరిగింది ఎలా...
చందా కొచ్చర్‌ భర్తకు నూ పవర్‌ గ్రూప్‌ పేరుతో పలు కంపెనీలు ఉన్నాయి. ఇంతకు ముందు నూ పవర్‌ రెన్యూవల్‌ ఎనర్జి కంపెనీలోకి వీడియోకాన్‌ నిధుల తరలింపు వివాదాస్పదమైంది. ఇదే కంపెనీలోకి మారిషస్‌ నుంచి ఎస్సార్‌ గ్రూప్‌ నిధులు వచ్చాయి. ఎస్సార్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ శశిరూయా అల్లుడు నిషాంత్‌ కనోడియా నుంచి రూ. 324.37 కోట్లు నూ పవర్‌ గ్రూప్‌లోకి రాగా, రుయాల మేనల్లుడు అనిరుధ్‌ భూవాల్కా కంపెనీల ద్వారా రూ. 197 కోట్లు వచ్చాయి. 


అంతా మారిషస్‌ నుంచే...
రుయా సోదరుల్లో ఒకరైన రవి రుయా కుమార్తె స్మితి రుయా భర్త నిషాంత్‌ కనోడియాకు మారిషస్‌లో మాటిక్స్‌ అనే గ్రూప్‌ ఉంది. మారిషస్‌లోని ఎస్సార్‌ గ్రూప్‌ ప్రధాన కంపెనీ ఎస్సార్‌ క్యాపిటల్‌ హోల్డింగ్‌ కంపెనీ నిషాంత్‌ కనోడియాకు చెందిన మాటిక్స్‌ గ్రూప్‌ కంపెనీ మాటిక్స్‌ ఫర్టిలైజర్స్‌ అండ్‌ కెమికల్స్‌లో రూ. 163.53 కోట్లు పెట్టుబడి పెట్టింది. మాటిక్స్‌ ఫర్టిలైలజర్స్‌కు చెందిన 16,35,40,343 షేర్లను కొనుగోలు చేసింది. 2010 డిసెంబర్‌ నుంచి 2011 ఆగస్టు మధ్య కాలంలో ఇది జరిగింది. మామగారి కంపెనీని నుంచి వచ్చిన నిధులకు మరికొంత నిధులు జోడించి మాటిక్స్‌ కంపెనీ చందా కొచ్చర్‌ భర్త కంపెనీలో రూ. 324.37 కోట్లను పెట్టుబడి పెట్టింది. ఈ డీల్‌ కూడా 2010 డిసెంబర్‌ నుంచే మొదలైంది.

  • 2010 డిసెంబర్‌ నుంచి 2012 మార్చి 21వ తేదీ మధ్య కాలంలో చందా కొచ్చర్‌ భర్తకు చెందిన నూ పవర్‌  రెన్యూవబుల్స్‌ కంపెనీలో మాటిక్స్‌ గ్రూప్‌ రూ. 324.37 కోట్లు పెట్టుబడి పెట్టింది. తమ గ్రూప్‌నకు చెందిన ఫస్ట్‌ల్యాండ్‌  హోల్డింగ్స్‌ అనే కంపెనీ ద్వారా పెట్టుబడి పెట్టారు. ఇది మొదటి పెట్టుబడి...
  • (ఇక్కడ గమనించాల్సిన కీలక అంశమేమిటంటే.... మారిషస్‌కు చెందిన ఫస్ట్‌ ల్యాండ్‌ హోల్డింగ్స్‌ కంపెనీ పెట్టబడులకు సంబంధించి పలువురు అభ్యంతరం వ్యక్తం చేయడంతో 2016లో ఆర్‌బీఐ దర్యాప్తు చేసింది. ఆ దర్యాప్తులో కూడా ఈ మారిషస్‌ కంపెనీ యాజమన్యంపై ఆర్‌బీఐ పలు సందేహాలు  వ్యక్తం చేసింది)


ఇది కూడా మారిషస్‌ నుంచే...
రెండో పెట్టుబడి రుయాల మేనల్లుడైన అనిరుధ్‌ భూవల్కాకు చెందిన కంపెనీల ద్వారా చందా కొచ్చర్ భర్త కంపెనీకి నిధులు వచ్చాయి. ఎస్సార్‌ గ్రూప్‌నకు చెందిన ఏషియా మోటార్‌ వర్క్స్‌ హోల్డింగ్స్‌ అనే కంపెనీ దీపక్‌ కొచ్చర్‌కు చెందిన నూ పవర్‌ టెక్నాలజీస్‌ అనే కంపెనీని కొనుగోలు చేసింది. ఇందులో నేరుగా పెట్టుబడులు పెట్టకుండా ఎఎండబ్ల్యూ మోటార్స్‌ లిమిటెడ్‌ అనే కంపెనీ ద్వారా  రూ. 197 కోట్ల పెట్టుబడి పెట్టిందని అరవింద్‌ గుప్తా ప్రధానికి రాసిన లేఖలో ఆరోపించారు. వాస్తవానికి నూ పవర్‌ టెక్నాలజీస్‌కు అంత సీన్‌ ఉందా అన్నది అరవింద్‌ గుప్తా లేవనెత్తున్న ప్రశ్న. కేవలం ఐసీఐసీఐ బ్యాంక్‌ నుంచి తీసుకున్న భారీ రుణాలకు గాను నజరానా కింద చందా కొచ్చర్‌ భర్త దీపక్‌ కొచ్చర్‌ నుంచి భారీ మొత్తంలో కంపెనీ కొనుగోలు చేశారని ఆయన లేఖలో ఆరోపించారు. 


ఐసీఐసీఐ బ్యాంక్‌ భారీ రుణాలు...
ఎస్సార్‌ గ్రూప్‌ దేశవిధాల్లో భారీ ఎత్తున కంపెనీలను కొనుగోలు చేసింది. ఎస్సార్‌ స్టీల్‌ మినెసోటా కంపెనీ కొనుగోలుకు వివిధ దేశాలకు చెందిన బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంది. అమెరికాకు చెందిన వివిధ ఫండ్స్‌ కూడా భారీగా నిధులు ఇచ్చాయి. మొత్తం కంపెనీ రుణం 102 కోట్ల డాలర్లు కాగా... ఇందులో 25 శాతం పైగా రుణాలు ఐసీఐసీఐ బ్యాంక్‌ ఇచ్చిందని అరవింద్‌ గుప్తా ఆరోపించారు. ఒక్క ఐసీఐసీఐ బ్యాంకే 35 కోట్ల డాలర్ల రుణం ఇచ్చినట్లు  ప్రధానికి రాసిన లేఖలో అరవింద్‌ గుప్తా ఆరోపించారు. ఎస్సార్‌ స్టీల్‌ మినెసొటా (అమెరికా) అలగొమా స్టీల్‌ (కెనడా) కంపెనీల కొనుగోలుకు ఐసీఐసీఐ బ్యాంక్‌కు చెందిన విదేశీ శాఖలు భారీ మొత్తంలో నిధులు ఇచ్చాయని అరవింద్‌ గుప్తా ఆరోపించారు. సింగపూర్‌, బ్రిటన్‌, న్యూయార్క్‌లలోని తమ శాఖల ద్వారా ఐసీఐసీఐ బ్యాంక్‌ ఈ రుణాలు ఇచ్చిందన్నారు. 2010లో ఎస్సార్‌ స్టీల్‌ కొనుగోలుకు 53 కోట్ల డాలర్ల రుణాన్ని లీడ్‌ బ్యాంక్‌ ఐసీఐసీఐ బ్యాంక్‌ ఎస్సార్‌ గ్రూప్‌కు ఇచ్చింది. అలాగే బ్రిటన్‌లోని స్లాన్‌ఫ్లో రిఫైనరీ కొనుగోలు కోసం మరో 35 కోట్ల డాలర్ల రుణాన్ని ఎస్సార్‌ ఆయిల్‌ కంపెనీకి ఐసీఐసీఐ బ్యాంక్‌ ఇచ్చిందని అరవింద్‌ గుప్తా ఆరోపించారు.


తాము ఒక్కరే కాదు....
ఐసీఐసీఐ బ్యాంక్‌ మాత్రం ఈ ఆరోపణలను ఖండించింది. ఎస్సార్‌ గ్రూప్‌కు తాము ఒక్కరమే రుణం ఇవ్వలేదని, ఏడు బ్యాంకుల కన్సార్టియం రుణాన్ని ఇచ్చిందన్న అంశాన్ని ప్రస్తావించింది.


మాకు సంబంధం లేదు...
నూ పవర్‌లో పెట్టుబడి పెట్టిన ఫస్ట్‌ ల్యాండ్‌ హోల్డింగ్స్‌తో తమ గ్రూప్‌నకు ఎలాంటి సంబంధం లేదని ఎస్సార్‌ గ్రూప్‌ తెలిపింది. 1980 నుంచి తాము ఐసీఐసీఐతో లావాదేవీలు నిర్వహిస్తున్నామని... తమ లావాదేవీలన్నీ పారదర్శకంగా ఉన్నాయని ఎస్సార్‌ గ్రూప్‌ స్పష్టం చేసింది. తమ రుణాల సంగతి బహిరంగ రహస్యమని తెలిపింది.  అలాగే మాటిక్స్‌ గ్రూప్‌ కూడా తమకు ఐసీఐసీఐ బ్యాంక్‌కు సంబంధం లేదని వెల్లడించింది. ఫస్ట్‌ల్యాండ్‌ హోల్డింగ్స్‌తో ఎస్సార్‌కు సంబంధం లేదని తెలిపింది. అలాగే కంపెనీ అభివృద్ధికి మంచి అవకాశాలు ఉన్న రంగంలో ఉన్నందున నూ పవర్‌లో తాము పెట్టుబడులు పెట్టామని మాటిక్స్‌ పేర్కొంది. తరవాత ఆ కంపెనీ నుంచి వైదొలగామని తెలిపింది.