రివ్యూ : ఇదమ్ జగత్ 

రివ్యూ : ఇదమ్ జగత్ 

నటీనటులు : సుమంత్, అంజు కురియన్, శివాజీరాజా, సత్య తదిరతులు 

సంగీతం :  శ్రీచరణ్ పాకాల 

ఫోటోగ్రఫి : బాల్ రెడ్డి 

నిర్మాత : జొన్నల గడ్డ పద్మావతి, గంగపట్నం శ్రీధర్ 

దర్శకత్వం: అనిల్ శ్రీకాంతం 

సుమంత్ చాలా గ్యాప్ తరువాత మళ్ళిరావా సినిమాతో హిట్ ఇచ్చాడు.  ఈ సినిమా హిట్ కావడంతో సుమంత్ కు అవకాశాలు మళ్లిరావడం మొదలుపెట్టాయి.  ఇటీవలే వచ్చిన సుబ్రహ్మణ్యపురం సినిమా కూడా మంచి విజయం సాధించింది.  ఆ తరువాత ఇప్పుడు ఇదమ్ జగత్ పేరుతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.  మరి ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా లేదా ఇప్పుడు చొద్దాం.  

కథ : 

సుమంత్ ఓ నిరుద్యోగి. అందరిలా ఉద్యోగాల కోసం ప్రయత్నం చేయకుండా.. తనకు తెలిసిన కెమెరా జర్నలిజాన్ని ఫ్రీ లాన్స్ పద్దతిలో ఉపయోగించుకోవాలని చూస్తాడు.  నైట్ టైమ్ రిపోర్టర్ గా అవతారం ఎత్తుతాడు.  నగరంలో జరిగే నేరాలు ఘోరాలను తన కెమెరాలో షూట్ చేసి వాటిని మీడియా చానళ్లకు అమ్మి డబ్బు సంపాదిస్తుంటాడు.  ఇలాంటి సమయంలో అతనికి హీరోయిన్ అంజు కురియన్ పరిచయం అవుతుంది.  తను చేసే ఉద్యోగం గురించి బయటకు చెప్పడు.  ఓ సమయంలో సుమంత్ షూట్ చేసిన ఫుటేజ్ అతని జీవితాన్ని మలుపు తిప్పుతుంది.  దాని కారణంగా అంజు కురియన్ దూరం అవుతుంది.  ఇంతకీ ఆ ఫుటేజ్ ఏంటి.. అందులో ఏముంది అన్నది మిగతా కథ.  

విశ్లేషణ : 

నేరాలు ఘోరాలు ఎక్కువగా రాత్రి వేళల్లోనే జరుగుతుంటాయి.  వాటిని షూట్ చేసి మీడియాకు అమ్ముకోవడం అన్నది కొత్త పాయింట్.  ఈ పాయింట్ ను రాసుకున్నందుకు దర్శకుడికి, డేర్ చేసి సినిమా చేసినందుకు సుమంత్ కు హ్యాట్సాఫ్ చెప్పాలి.  సినిమా మొత్తం ఈ పాయింట్ చుట్టూనే తిరుగుతుంది.  సుమంత్ పాత్రను డిజైన్ చేసిన తీరు ఆసక్తిగా ఉంటుంది. మొదటి హాఫ్ యాక్సిడెంట్స్, చిన్న చిన్న నేరాల చుట్టూ నడిపించిన కథ సెకండ్ హాఫ్ దగ్గరికి వచ్చే సరికి ఉత్కంఠభరితంగా మారుతుంది.  

మర్డర్ సీన్ ను సుమంత్ తన కెమెరాలో బంధిస్తాడు.  అక్కడి నుంచి అసలు కథ మొదలౌతుంది.  ఉత్కంఠభరితంగా కథను ముందుకు నడిపించాడు. మర్డర్ ఎవరు చేశారు.. ఎందుకు చేశారు ..? విలన్ ఎవరు అనే విషయాలను రివీల్ చేయడంలో వచ్చిన సన్నివేశాలు, ట్విస్ట్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.

నటీనటుల పనితీరు : 

సుమంత్ ఒక్కడై సినిమాను నడిపించాడు.  అతని పాత్ర చుట్టూనే సినిమా కథ మొత్తం నడుస్తుంది.  ఇలాంటి పాత్రలు చేయడం సుమంత్ కు కొత్తే కానీ, నటనలో వైవిధ్యం కనబరిచే విధంగా నటించాడు.  హీరోయిన్ అంజు కురియన్ తెలుగులో మొదటి సినిమా.  పర్వాలేదనిపించింది. శివాజీరాజా, బ్రహ్మాజీ లు వారి పాత్ర మేరకు మెప్పించారు.  కళ్యాణ్ చేసిన పాత్ర ఆకట్టుకుంటుంది.  సినిమాలో ఇది హైలైట్ గా నిలిచే పాత్ర అని చెప్పొచ్చు.  

సాంకేతిక వర్గం : 

దర్శకుడిగా మొదటి సినిమా అయినప్పటికీ అనిల్ కథనురాసుకున్న తీరు, నడిపించిన విధానం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా సెకండ్ హాఫ్.  కొన్ని సన్నివేశాలు తేలిపోయినట్టు అనిపించాయి.  వాటిని ఇంకాస్త బాగా డిజైన్ చేసుకొని ఉంటె బాగుండేది.  బడ్జెట్ పరిమితి కావడంతో కొన్ని సన్నివేశాల్లో ఆ రిచ్ నెస్ కనిపించలేదు.  కెమెరా, బ్యాగ్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది.  

పాజిటివ్ పాయింట్స్ : 

కథ 

నటీనటులు 

స్క్రీన్ ప్లే 

మైనస్ పాయింట్స్ : 

ఫస్ట్ హాఫ్ 

చివరిగా : పర్వాలేదనిపించింది ఇదమ్ జగత్